యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు నిరాశ తప్పేలా లేదు. ప్రభాస్ నటిస్తున్న తాజాగా చిత్రం సాహో. యువ దర్శకుడు సుజిత్ ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఇండియా మొత్తం సాహో చిత్రంపై కనీవినీ ఎరుగని విధంగా అంచనాలు నెలకొనిఉన్నాయి. 

ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 15న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. తాజా సమాచారం ప్రకారం సాహో విడుదల తేదీ వాయిదా పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఆగష్టు 30న సాహో చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారట. 

సాహో లాంటి భారీ చిత్రం విడుదలవుతున్న సమయంలో మరే చిన్న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సాహసించరు. అలాంటిది తాజాగా శర్వానంద్ నటించిన రణరంగం చిత్రాన్ని ఆగష్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 

రణరంగం విడుదలవుతుండటంతో సాహో చిత్రం వాయిదాపడ్డ వార్తలకు బలం చేకూరుతోంది. గత రెండేళ్లుగా ప్రభాస్ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిరాశే. ఈ విషయంలో యువి క్రియేషన్స్ నిర్మాతలు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.