ప్రభాస్‌ తన `సలార్‌` సినిమా నిర్మాతపై ప్రశంసలు కురిపించారు. ఆయనతో కనెక్ట్ కావడానికి కారణం తెలిపారు. అంతేకాదు భవిష్యత్‌లో మరిన్ని సినిమాలు చేయబోతున్నట్టు తెలిపారు. 

ప్రభాస్‌ నెక్ట్స్ నాలుగైదు సినిమాల లైనప్‌తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఏకకాలంలో `ది రాజాసాబ్‌`, `ఫౌజీ` చిత్రాలు చేస్తున్నారు. అనంతరం సందీప్‌రెడ్డి వంగాతో `స్పిరిట్‌` మూవీ ప్రారంభించాల్సి ఉంది. 

అలాగే ప్రశాంత్‌ వర్మతో సినిమా చేయనున్నారు. ఇవి పూర్తయిన తర్వాత `సలార్‌ 2`, `కల్కి 2` చిత్రాలు చేయనున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్‌ కంటిన్యూగా ఒక ప్రొడక్షన్‌ హౌజ్‌తో సినిమాలు చేయబోతున్నారు. అదే హోంబలే ఫిల్మ్స్.

హోంబలే ఫిల్మ్స్ లో మూడు సినిమాలు చేయడంపై ప్రభాస్‌

ఈ బ్యానర్‌లో ఇప్పటికే `సలార్‌` మూవీ చేశారు. అనంతరం `సలార్‌ 2` రానుంది. వీటితోపాటు మరో మూవీ ఉంది. ఇది కాకుండా ఈ బ్యానర్‌లో మరికొన్ని సినిమాలు చేయనున్నారట ప్రభాస్‌. తాజాగా ఆయనే ఈ విషయాన్ని తెలిపారు. 

హోంబలే ఫిల్మ్స్ తో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. తాజాగా ప్రభాస్‌ `హాలీవుడ్‌ రిపోర్టర్‌`తో షార్ట్ గా ఈ విషయాలను పంచుకున్నారు. 

వారు తెలిపిన కథనం ప్రకారం హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్‌ కిరగందూర్‌తో కనెక్ట్ కావడానికి కారణం ఏంటో తెలిపారు ప్రభాస్‌.

చిన్ననాటి స్నేహితులకు దగ్గరగా విజయ్‌ కిరగందూర్‌

విజయ్‌ కిరగందూర్‌.. టీమ్‌ని చూసుకునే తీరు బాగుంటుంది, చాలా కేర్‌ తీసుకుంటారు. అదే సమయంలో చాలా సింపుల్‌గా ఉంటారు. ఆయనతో ఉంటే ఒక ఫ్యామిలీతో ఉన్నట్టుగా ఉంటుంది. అదే మమ్మల్ని దగ్గర చేసింది. మేం కలిసి ఇంకా చాలా ప్లాన్‌ చేస్తున్నాం` అని తెలిపారు ప్రభాస్‌. 

`మా మొదటి సినిమా `సలార్‌` నుంచి నేను వారి ఇంట్లో ఉన్నట్టుగా భావిస్తున్నా. ఆయన చిన్ననాటి స్నేహితులకు దగ్గరగా ఉంటారు. ఎంత ఎదిగినా వారిని దూరం చేసుకోలేదు. నాలాగే ఎక్కువగా బయటకు వెళ్లరు. ఆ లక్షణం నాకు మరింతగా కనెక్ట్ అయ్యింది` అని అన్నారు ప్రభాస్‌.

మనీ కంటే క్వాలిటీకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు

నిర్మాతకు సంబంధించిన మరో విషయాన్ని పంచుకుంటూ `కేజీఎఫ్‌` సినిమా షూటింగ్‌ సమయంలో సెట్‌ మంటల్లో చిక్కుకుంది. బడ్జెట్‌ ఎక్కువైంది. టీమ్‌ టెన్షన్‌ పడుతున్నారు. 

ఆ సమయంలో విజయ్‌ చెప్పిన మాట రిలాక్స్ అవ్వండి, డబ్బు గురించి కాదు, ప్రొడక్షన్‌ గురించి ఆలోచించండి. నాకు క్వాలిటీ ముఖ్యం, మనీ కాదు` అని ఆయన చెప్పిన విధానం బాగా నచ్చింది. ఆ లక్షణమే మేం కలిసి మరిన్ని ప్రాజెక్ట్ లు చేయడానికి కారణమవుతుంది` అని చెప్పారు ప్రభాస్‌.

ప్రభాస్‌ ఇలా రియాక్ట్ కావడం చాలా అరుదు. అది కూడా ఒక ప్రొడక్షన్‌ హౌజ్‌ గురించి ఇంత బాగా చెప్పడం విశేషం. ప్రభాస్‌ ప్రస్తుతం `ది రాజాసాబ్‌` మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. 

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. డిసెంబర్‌ 5న ఈ చిత్రం విడుదల కానుంది. రొమాంటిక్‌ కామెడీ హర్రర్‌ ఫాంటసీగా రూపొందుతుంది. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు.