ఆ ఘనత రజినీ తర్వాత ప్రభాస్ దే.. నిలబెట్టుకోవాలి

prabhas repace rajini as south super star in future
Highlights

  • బాహుబలి సినిమాతో మారిపోయిన ప్రభాస్ రేంజ్
  • దేశవ్యాప్తంగానే కాక ప్రపంచస్థాయిలో క్రేజీ హీరోగా మారిన ప్రభాస్
  • దక్షిణాది హీరోల్లో రజినీ తర్వాత అంతటి క్రేజ్ ప్రభాస్ దే నంటున్న ఎనలిస్ట్ లు

సినీ పరిశ్రమలో దక్షిణాదికి చెందిన సూపర్ స్టార్ ఎవరా అనగానే టక్కున గుర్తొచ్చే పేరు సూపర్ స్టార్ రజినీకాంత్. దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తోపాటు, ప్రతి ఒక్కరు గుర్తుపట్టే కరిష్మా వున్న స్టార్ ఎవరు అంటే.... అందరూ చెప్పే ఒకే ఒక్క పేరు సూపర్ స్టార్ రజనీకాంత్. సౌత్‌ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో రజనీకాంత్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. మరి రజనీకాంత్ రాజకీయాలకు వెళ్తారనే వార్తల నేపథ్యంలో ఆయన తర్వాత సౌత్ నుండి ఆస్థాయిలో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన స్టార్ ఎవరు అనే చర్చ జరుగుతోంది.

 

విశేషమేంటంటే రజినీ తర్వాత అంతటి క్రేజ్ వున్న దక్షిణాది స్టార్ గా మన తెలుగు హీరో, బాహుబలి స్టార్ ప్రభాస్ పేరు వినిపిస్తోంది. ‘బాహుబలి' సినిమా ముందు ప్రభాస్ కూడా అసలు తనకు దేశ వ్యాప్తంగా ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుందని, నేషనల్ స్థాయి హీరోను అవుతానని, ఇంటర్నేషనల్ లెవల్‌కి ఈ సినిమా వెలుతుందని అనుకుని వుండడు. అలాంటిది బాహుబలి ప్రాజెక్ట్ ప్రభాస్ జీవితాన్ని మార్చేసింది.

 

ఈ ఏడాది ప్రభాస్ నటించిన ‘బాహుబలి-ది కంక్లూజన్' మూవీ విడుదలైన తొలిరోజే రూ. 121 కోట్లు వసూలు చేయడం సినీ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. సూపర్ స్టార్లకు సాధ్యం కానిది ప్రభాస్ సాధించాడు. రూ. 1000 కోట్ల కలెక్షన్ దాటిన తొలి ఇండియన్ సినిమాగా బాహుబలి రికార్డులకెక్కింది. ఓవరాల్ గా రూ. 1700 కోట్లు వసూలు చేసింది. బాహుబలి ప్రాజెక్టుతో ప్రభాస్‌ దేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అతడికి పెళ్లి కాలేదని తెలిసి వేలాది మంది అమ్మాయిలు ప్రపోజల్స్ పంపారంటే.... అతడికి ఉన్న ఫాలోయింగ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

 

ఇండియాలో సౌత్ సినిమా, నార్త్ సినిమా పరిశ్రమలు భిన్నంగా ఉంటాయి. సౌత్ సినిమాలకు నార్త్‌ లో పెద్దగా ఆదరణ లభించదు, బాలీవుడ్లో ఎంత పెద్ద స్టార్ అయినా సౌత్‌లో ఆ సినిమాలు పెద్దగా ఆడవు. ఇండియాలో ఇప్పటి వరకు ఈ గీతను చెరిపేసి ఎక్కడైనా తన సినిమా ఆడేలా ఫాలోయింగ్, ఫ్యాన్ క్రేజ్ సంపాదించుకున్న స్టార్ రజనీకాంత్ మాత్రమే. అయితే రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో దేశ వ్యాప్తంగా అభిమానుల మనసుల్లోకి చొచ్చుకెళ్లిన స్టార్ ప్రభాస్ మాత్రమే అంటున్నారు విశ్లేషకులు.

 

ప్రముఖ ట్రేడ్ ఎక్స్ పర్ట్ అముల్ మోహన్ ఇదే అంశంపై విశ్లేషిస్తూ... సౌత్ స్టార్ల సినిమాలు తమ సొంత రాష్ట్రం దాటి బయటకు వచ్చి ఆడటం చాలా కష్టం. ఈ విషయంలో కొన్ని దశాబ్దాలుగా సక్సెస్ అవుతూ వస్తున్న స్టార్ రజనీకాంత్ ఒక్కరే. 2017 సంవత్సరంలో ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చింది.... భవిష్యత్తులో ఇండియన్ సినిమా పరిశ్రమలో రజనీకాంత్ స్థానం ఆక్రమించేది ప్రభాస్ మాత్రమే' అని తెలిపారు. అంతేకాదు.. బాహుబలి తర్వాత ప్రభాస్‌ను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. ప్రభాస్ నెక్ట్స్ మూవీ ‘సాహె' ఎప్పుడు వస్తుందా? అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

 

ప్రభాస్ తన చిన్ననాటి స్నేహితులతో ఇప్పటికీ చాలా క్లోజ్‌గా ఉంటారు. రజనీకాంత్ కూడా తన స్నేహితులకు ఎంత వ్యాల్యూ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ విషయంలో ఇద్దరూ ఒకే విధంగా అనిపిస్తారంటూ పోల్చి చూస్తున్నారు అభిమానులు. అయితే బాహుబలి ప్రాజెక్టు ద్వారా వచ్చిన స్టార్ ఇమేజ్, ఫాలోయింగ్ ప్రభాస్ నిలబెట్టుకుంటూ... జాతీయ స్థాయిలో మరికొన్ని హిట్స్ కొడితే భవిష్యత్తులో రజనీకాంత్ వారసుడు ప్రభాస్ అవ్వడం ఖాయం అంటున్నారు. మరి ఈ నమ్మకాన్ని ప్రభాస్ ఏమేరకు నిలబెట్టుకుంటాడో చూడాలి.

loader