బాహుబలి సినిమాకు ప్రభాస్ కు భారీ రెమ్యునరేషన్ ముందు అనుకున్నదానికంటే మూడు రెట్లు బాహుబలి సినిమా కోసం ఐదేళ్లు సమయం కేటాయించిన ప్రభాస్

బాహుబలి సినిమా కోసం హీరో ప్రభాస్ తీసుకున్న రిస్క్ మామూలుదేం కాదు. ఐదేళ్ల పాటు కేవలం ఒకే ఒక్క సినిమాకు సమయాన్ని వెచ్చించడమంటే మామూలు విషయం కాదు. అందునా మంచి సక్సెస్ రేటున్న ఒక స్టార్ హీరోకు అది అస్సలు కుదరదు. కానీ కుదిరింది. అందుకే ఇప్పుడు ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ గా మారాడు. దేశ వ్యాప్తంగా ప్రభాస్ కు బాహుబలితో వచ్చిన గుర్తింపు తాను ఐదేళ్లు కేటాయించిన సమయాన్ని మించే వచ్చింది. ఇక పేరుతోపాటు తన కష్టానికి తగ్గ ప్రతిఫలం రెమ్యునరేషన్ రూపంలో అందిందా అంటే అది కూడా ప్రభాస్ అనుకున్న దాని కంటే ఎక్కువగానే వచ్చిందట.

బాహుబలి రిలీజ్ వరకు కేవలం తెలుగు హీరోగా మాత్రమే క్రేజ్ ఉన్న ప్రభాస్.... బాహుబలి రిలీజ్ తర్వాత నేషనల్ లెవెల్ లో స్టార్ హీరో అయిపోయాడు. బాహుబలి సినిమా చేసి ఉండకపోతే ఆ గ్యాపులో ప్రభాస్ కనీసం ఎనిమిది సినిమాలైనా చేసి ఉండేవాడు... ఆ సినిమాల ద్వారా ప్రభాస్ ఎంత సంపాదించేవాడో అంతకంటే ఎక్కువే పొందాడు.

ఐదేళ్ల క్రితం బాహుబలి ప్రాజెక్టు కన్ఫమ్ చేసినప్పుడు ప్రభాస్ రెమ్యూనరేషన్ రూ. 5 కోట్లకు కాస్త అటు ఇటుఇటుగా ఉండేది. అప్పుడు బాహుబలి ప్రాజెక్టుకు అనుకున్న బడ్జెట్, ప్రభాస్ నుండి తీసుకునే డేట్స్ బేరీజు వేసుకుని 20 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ ఇవ్వాలని అనుకున్నారట. బాహుబలి ది బిగినింగ్ భారీ విజయం సాధించిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. ముందు ఊహించిన దానికంటే సినిమా మార్కెట్ కూడా బాగా పెరగడంతో ప్రభాస్ రెమ్యూనరేషన్ కూడా పెంచేసారు. రెండు ప్రాజెక్టులకు కలిపి ప్రభాస్ కు రూ. 75 కోట్లు రెమ్యూనరేషన్ ముట్టజెప్పినట్లు సమాచారం.

బాహుబలి సినిమాతో ప్రభాస్ లైఫ్ మారిపోయింది. రీజనల్ స్టార్ నుండి నేషనల్ స్టార్ అయ్యాడు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా అంటే అది కేవలం తెలుగు బాషకే పరిమితం కాదు... హిందీ, తమిళం ఇలా మల్టీ ల్వాంగేజ్ మూవీ. ప్రభాస్ తదుపరి చిత్రం సాహో యే అందుకు నిదర్శనం. సాహో సినిమాకు ప్రభాస్ రూ. 30 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.