దక్షిణాది హీరోల నుంచి ప్రభాస్ ఒక్కడే...

prabhas ranked among top ten india stars of imdb
Highlights

  • ఇండియాస్ టాప్ స్టార్స్ జాబితా రిలీజ్ చేసిన ఐఎండీబీ
  • ఐఎండీబీ టాప్10 స్టార్స్ లిస్ట్ లో దక్షిణాది హీరోల్లో ఒకేఒక్కడు ప్రభాస్
  • ఈ లిస్ట్ లో తమన్నాకు నాల్గవ స్థానం రావటంతో సినీగోయెర్స్ విస్మయం

అంతర్జాతీయంగా విశేష ఆదరణ వున్న పాపులర్ మూవీ వెబ్ సైట్ 'ఇంటర్నెట్ మూవీ డేటాబేస్'(IMDb). తాజాగా తన వెబ్ సైట్ ఇండియాలో 2017లో టాప్ 10 స్టార్స్ గా నిలిచిన వారి వివరాలు ప్రకటించింది. అయితే ఈ వెబ్ సైట్ ప్రకటించిన టాప్ 10 ర్యాంకింగ్స్ ప్రేక్షకులను షాక్ కు గురిచేస్తున్నాయి. సినిమాలు ప్లాప్ అయిన స్టార్లు, అతిథి పాత్రలు పోషించిన స్టార్లకు టాప్ ర్యాంక్స్ దక్కడం, తమ సినిమాలతో హిట్స్ కొట్టిన వారు తర్వాతి స్థానంలో ఉండటం చూసి అభిమానులు షాకవుతున్నారు.

 

ఈ ర్యాంకింగ్స్ లిస్టులో హీరోయిన్ తమన్నాకు 4వ స్థానం దక్కడంపై ప్రేక్షకులు షాక్ తిన్నారు. ఈ ఏడాది తమన్నా నటించిన సినిమాలు 3 విడుదలయ్యాయి. ‘బాహుబలి 2' సినిమాలో ఆమె చిన్న అతిథి పాత్ర చేసింది. ఎన్టీఆర్ జై లవ కుశలో ఐటం సాంగ్ చేసింది. ఇక ఆమె హీరోయిన్ గా శింబుతో నటించిన తమిళ చిత్రం పెద్ద ప్లాప్ అయింది. మరి తమన్నాకు 4వ ర్యాంకు ఎలా వచ్చిందో తెలియక అంతా ఆశ్చర్యపోతున్నారు.

 

‘ఐఎండిబి' ఈ ర్యాంకింగ్స్ మాత్రం తమ వెబ్ సైట్లో స్టార్ మీటర్ లెక్కలు,  పేజ్ వ్యూస్, ఏ స్టార్ ఎక్కువ కాలం టాప్ లో ఉన్నాడు అనే లెక్కల ఆధారంగానే ఈ ర్యాంకింగ్స్ విడుదల చేసిందట.

 

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఈ లిస్టులో నెం.1 స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది షారుక్ ‘రాయీస్', జబ్ హ్యారీ మెట్ సెజల్” అనే చిత్రాల్లో నటించారు. అమీర్ ఖాన్ రెండో స్ఠానంలో నిలిచారు. ఈ ఏడాది అమీర్ ఖాన్ ఒకే ఒక సినిమాలో నటించారు. ‘సీక్రెట్ సూపర్ స్టార్' సినిమాలో గెస్ట్ రోల్ చేయడంతో పాటు ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించారు.  ఈ ర్యాకింగ్స్‌ లో సల్మాన్ ఖాన్ 3వ స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది ఆయన నటించిన ‘ట్యూబ్ లైట్' చిత్రం మాత్రమే విడుదలైంది. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం ఫెయిలైంది. ఈ నెల చివర్లో ఆయన నటించిన ‘టైగర్ జిందా హై' సినిమా విడుదల కానుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఐఎండిబి ర్యాకింగ్స్ లో 5వ స్థానం దక్కించుకున్నారు.

 

ఐఎండిబి టాప్ 10 ర్యాంకింగ్స్‌ లో సౌత్ నుండి హీరోల్లో కేవలం ప్రభాస్ కు మాత్రమే స్థానం దక్కింది. ఈ ఏడాది ప్రభాస్ నటించిన ‘బాహుబలి 2' భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ర్యాంకింగ్స్ లో బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మకు 7వ స్థానం దక్కగా.. సౌత్ హీరోయిన్ అనుష్క శెట్టికి ఐఎండిబి ర్యాంకింగ్స్ లో 8వ స్థానం దక్కింది. బాహుబలి తో అనుష్క బాలీవుడ్ ఫాలోవర్స్ లో కూడా బాగా పాపులర్ అయింది.

 

హృతిక్ రోషన్‌కు ఐఎండిబి ర్యాంకింగ్స్‌ లో 9వ స్థానం దక్కింది. ఈ ఏడాది హృతిక్ రోషన్ నటించిన చిత్రం ‘కాబిల్' మాత్రమే విడులైంది. కత్రినా కైఫ్‌కు 10వ స్థానం దక్కింది. అయితే ఈ ర్యాకింగ్స్ సరైనవి కావని అంటున్నారు సినీగోయెర్స్.

loader