ప్రభాస్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమా  ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ (2011). ఈ సినిమా కాపీ వివాదం చాలా కాలం నుంచి సాగుతోంది. ఇప్పటికి ఈ విషయమై కోర్టు తీర్పు ఇచ్చింది.  రచయిత్రి శ్యామలారాణి నవల ‘నా మనసు నిన్ను కోరె’ కథ, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ సినిమా కథ ఒకేలా ఉన్నాయని హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు పేర్కొంది.

 2017 సెప్టెంబరులో శ్యామల తన కథను దొంగలించి ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ (2011) సినిమా తీశారని కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు కాపీరైట్‌ చట్టం కింద నిర్మాత దిల్‌రాజుపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ కథ, ‘నా మనసు నిన్ను కోరె’ కథ దాదాపు ఒకేలా ఉన్నాయని హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు నిర్ధారించినట్లు తెలిసింది. ఈ కేసు విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోమని కోర్టు పోలీసు శాఖను ఆదేశించిందని సమాచారం.

రచయిత్రి  శ్యామల మాట్లాడుతూ.. ‘కోర్టులో ఈ విషయాన్ని తేల్చుకోవాలనే ఆసక్తి నాకు లేదు. కానీ దిల్‌రాజు నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఇలా చేయాల్సి వచ్చింది’ అన్నారు.

‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ దర్శకుడు దశరథ్‌ మాట్లాడుతూ.. ‘శ్యామలా రాణి నవల 2010 ఆగస్టులో పబ్లిష్‌ అయ్యింది. కానీ నేను ఈ సినిమా కథను 2009 ఫిబ్రవరిలో ‘నవ్వుతో’ అనే టైటిల్‌తో సినీ రచయిత సంఘంలో నమోదు చేయించా. నేను దీనికి సంబంధించిన పత్రాన్ని కూడా కోర్టుకు సమర్పించా. 2008లో ప్రభాస్‌ ‘బిల్లా’ సినిమా షూటింగ్‌ నిమిత్తం మలేషియాలో ఉన్నప్పుడు నేను, దిల్‌రాజు కలిసి వెళ్లి ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ కథను నరేట్‌ చేశాం. ఆ సినిమా కథ కాఫీ కొట్టింది అనడంలో నిజం లేదు. నా కథ ఆమె నవల కన్నా ముందే ఉంది’ అని ఆయన అన్నారు. 

మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రంకి దిల్ రాజు స్టోరీ అందించానని అప్పట్లో  చెప్తుకొచ్చారు. అందుకే కథ..శ్రీ వెంకటేశ్వర యూనిట్ అని పడింది. ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి నిర్మాత కథ ఇచ్చినప్పుడు అలా వేయటం ఆనవాయితీగా వస్తోందని, తాను అదే చేస్తున్నానని దిల్ రాజు అన్నారు. ఇక ఈ చిత్రం కథ తన మనస్సులో చాలా కాలం నుంచీ ఉన్నదని, దశరధ్ తన దగ్గరకి వచ్చినప్పుడు ఆ ప్లాట్ చెప్పి డవలప్ చేయమన్నానని, అందుకే ఆ క్రెడిట్ యూనిట్ కే చెందాలని భావిస్తున్నానని వివరణ ఇచ్చారు.