యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తిరుగులేని హీరో. బాలీవుడ్ స్టార్స్ సైతం అసూయపడేలా ప్రభాస్ క్రేజ్ వ్యాపించింది. సాహో ప్రస్తుతం విడుదలకు ముందే ప్రకంపనలు రేపుతోంది. ప్రభాస్ ఇంతటి క్రేజ్ కు కారణం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలినే. అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ ఆడియన్స్ లో చెరగని ముద్ర వేశాడు. 

సాహో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రభాస్ బాహుబలి 3పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాహుబలి 2 విడుదలకు ముందు ఈ సిరీస్ కొనసాగుతుందని రాజమౌళి కూడా తెలిపాడు. కానీ బాహుబలి 3పై స్పష్టమైన ప్రకటన చేయలేదు. తాజాగా ప్రభాస్ మాట్లాడుతూ.. బాహుబలి కథ ఇంకా పూర్తి కాలేదు. రెండు భాగాలు తీసినా మేము 60 శాతం కథని మాత్రమే చెప్పాం. 

రాజమౌళికి ఆసక్తి కలిగినప్పుడు బాహుబలి 3 కూడా ఉంటుంది అని ప్రభాస్ తెలిపాడు. అయితే బాహుబలి 3 ఖచ్చితంగా ఉంటుందని మాత్రం తాను గ్యారెంటీ ఇవ్వలేనని ప్రభాస్ తెలిపాడు. ప్రస్తుతం ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న విడుదలకు సిద్ధం అవుతోంది.