పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కాస్తా అత్యుత్సాహం చూపించారు. ఏకంగా థియేటర్ లో మంటలు చెలరేగేలా చేశారు. దీంతో ఆడియెన్స్ భయంతో పరుగెట్టారు. ఇంతకీ ఎక్కడంటే.!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 43వ పుట్టిన రోజు వేడుకలను ఈ రోజు అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు స్టేట్స్ లో డార్లింగ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను పండగలా జరుపుతున్నారు. డార్లింగ్ పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే ‘రెబల్’ రీ-రిలీజ్ అవ్వగా.. ఈరోజు ‘బిల్లా’ 4కే వెర్షన్ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాలతో మాత్రం అభిమానులు బీభత్సంగా సెలబ్రేషన్స్ ను నిర్వహిస్తున్నారు.
థియేటర్లలో అభిమానుల సందడి మామూలుగా లేదు. సినిమా హాళ్ల వద్ద భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి డార్లింగ్ బర్త్ డే వేడుకలను నిర్వహించారు. అలాగే ‘బిల్లా’ రీ-రిలీజ్ సందర్భంగా అభిమానులు కాస్తా అత్యుత్సాహం చూపించారు. దీంతో ఓ థియేటర్ మొత్తం కాలిపోయింది. ఇదేక్కడంటే.. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని వెంకట్రామ థియేటర్ లో ఈ ఘటన జరిగింది. తాజా సమాచారం ప్రకారం.. చాలా కాలంగా మూతబడిన వెంకట్రామ థియేటర్ ను బిల్లా స్పెషల్ షో కోసం రీఓపెన్ చేశారు.
ఈ సందర్భంగా అభిమానులు షో స్టార్ట్ కాగానే థియేటర్ లో బాణాసంచా పేల్చారు. దీంతో ఒక్కసారిగా థియేటర్ లోని సీట్లకు నిప్పంటుకొని మంటలు చెలరేగాయి. ఆడియెన్స్ ఒక్కసారిగా భయంతో బయటికి పరుగెత్తారు. వెంటనే అప్రమత్తమైన థియేటర్ సిబ్బంది మంటల్ని ఆర్పి షోను నిలిపివేశారు. ఇదిలా ఉంటే బర్త్ డే సందర్భంగా ప్రభాస్ కు అభిమానులు, నెటిజన్లు స్పెషల్ పోస్టర్లతో విషెస్ తెలుపుతూనే ఉన్నారు.
