ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఫిష్ వెంకట్ రెండు కిడ్నీలు పాడైపోవడంతో అతడి ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు క్షీణీస్తోంది.
క్షీణిస్తున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం
ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఫిష్ వెంకట్ రెండు కిడ్నీలు పాడైపోవడంతో అతడి ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు క్షీణీస్తోంది. దీనితో ఆయన చికిత్స కోసం ఎవరైనా ప్రముఖులు సాయం చేస్తారేమో అని కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.
అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని 50 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ మేరకు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు తాజాగా తెలిపారు.
ప్రభాస్ సాయం చేయలేదు
ఆయన కుమార్తె మాట్లాడుతూ ప్రభాస్ సాయం చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు.ఆమె మాట్లాడుతూ.. ప్రభాస్ పీఏ అని ఒకరు కాల్ చేశారు. వివరాలు తెలుసుకొని సాయం చేస్తాం అని అన్నారు కానీ, ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి సాయం అందలేదు. తమకు వచ్చిన నెంబర్ కు కాల్ చేసినా ఎవరు లిఫ్ట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఫేక్ కాల్స్ తో కాలయాపన చేసే సమయం కాదని, తమ తండ్రి ఫిష్ వెంకట్ ఆరోగ్యం రోజురోజుకి దిగజారుతోందని, సాయం చేసేవాళ్లు ఎవరైనా సాయం చేయండి అంటూ వేడుకున్నారు.
ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం వల్ల నిజంగా ఆర్థిక సాయం చేయాలనుకునే వారు కూడా చేయకుండా ఉండే అవకాశం ఉంది. దయచేసి ఫేక్ న్యూస్ ప్రచారం చేయొద్దని ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు కోరుకున్నారు. ఫిష్ వెంకట్ తెలుగులో ఆది, దిల్, ఢీ, బుజ్జిగాడు, గబ్బర్ సింగ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, మిరపకాయ్, అదుర్స్ లాంటి చిత్రాల్లో కామెడీ విలన్ గా నటించారు.