డార్లింగ్ అభిమానులు ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. బాహుబలి సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్‌ వరుసగా అదే రేంజ్‌ సినిమాలు చేస్తున్నాడు. బాహుబలి తరువాత సాహో సినిమాను కూడా పాన్‌ ఇండియా రేంజ్‌లోనే చేసిన ప్రభాస్‌, ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న సినిమాలను కూడా అదే రేంజ్‌లో చేస్తున్నాడు. జిల్‌ ఫేం రాథాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమాను చేస్తున్నాడు.

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఇటలీ బ్యాక్‌ డ్రాప్‌లో రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతుంది. ఇప్పటికే మేజర్‌ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది. అయితే రాధే శ్యామ్ సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను కూడా ప్రకటించాడు ప్రభాస్‌. మహానటి ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో అశ్వనీదత్‌ నిర్మాణంలో వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. నాగ అశ్విన్ తెరకెక్కించబోయే సినిమాలో ప్రభాస్‌ సరసన హీరోయిన్‌గా దీపికా పదుకొనే నటిస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమాలో ప్రభాస్ సూపర్‌ స్టార్ తరహా పాత్రలో నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది.