పూనమ్ పాండే ఫేక్ డెత్ స్టంట్‌పై క్షమాపణ చెప్పిన పీఆర్ ఏజెన్సీ.. నిర్మలా సీతారామన్ గురించి ఏమన్నారంటే...
గర్భాశయ క్యాన్సర్ అవగాహన ప్రచారంలో భాగంగా పూనమ్ పాండే మరణించిందని ఫేక్ న్యూస్ ప్రచారం చేసినందుకు పూనమ్ పీఆర్ ఏజెన్సీ Schbang క్షమాపణలు తెలిపింది.
గర్భాశయ క్యాన్సర్ అవగాహన ప్రచారంలో భాగంగా నటి, సోషల్ మీడియా సెలబ్రిటీ పూనమ్ పాండే మరణించినట్లు గత శుక్రవారం ఆమె ఇన్ ఫ్టాలో పూనమ్ పీఆర్ టీం ఒక పోస్ట్ పెట్టింది. దీని మీద భిన్నాభిప్రాయాలు వెల్లడయ్యాయి. ఆ తరువాత ఆదివారం తాను చనిపోలేదంటూ పూనమ్ పోస్ట్ చేసింది. సర్వైకల్ క్యాన్సర్ అవగాహనలో భాగంగా తానిలా చేశానని తెలిపింది. దీంతో ఈ క్రమం మొత్తం తీవ్ర వివాదానికి దారి తీసింది. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పూనమ్ పాండే పీఆర్ ఏజెన్సీ, Schbang ఇలా చేసినందుకు క్షమాపణలు చెబుతూ ఒక ప్రకటన విడుదల చేసింది.
పూనమ్ పాండే, ఆమె ఏజెన్సీ ష్బాంగ్ చేసిన ఈ చర్యలు ఆరోగ్య ప్రచారం కోసమే అయినా.. ఇది చాలా చీప్ ట్రిక్ అని, నైతికత లేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతే ఇన్‌స్టాగ్రామ్‌లో మరో పోస్ట్ చేసింది ష్పాంగ్. అందులో ష్బాంగ్ తాము చేసిన పనికి క్షమాపణలు చెప్పారు.
"హాటర్ ఫ్లై సహకారంతో మేం పూనమ్ పాండేతో కలిసి గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించే ప్రయత్నంలో పాల్గొన్నాం. ఇలాంటి ప్రచారంతో ఇబ్బంది పెట్టినందుకు హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాం. ముఖ్యంగా ఆమె గురించి బాధపడిన వారికి, గర్భాశయ క్యాన్సర్ బాధితులకు, తమ ప్రియమైనవారు గర్భాశయ క్యాన్సర్ బారిన పడితే సతమతమవుతున్నవారికి మేము క్షమాపణలు చెబుతున్నాం’’ అని ఒక ప్రకటనలో తెలిపారు.
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ సెషన్ 2024 సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గర్భాశయ క్యాన్సర్ గురించి మాట్లాడినప్పుడు ఎవ్వరూ అంత పెద్దగా దాన్ని పట్టించుకోలేదని.. పూనమ్ పాండే, ష్బాంగ్ పీఆర్ ఏజెన్సీ పేర్కొంది.
పూనమ్ పాండే నిజంగా పోయినా బాగుండేది... నటి కస్తూరి ఫైర్
"మేము చేసిన ఈ పని లక్ష్యం - గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన పెంచడం కోసమే. 2022లో, భారతదేశంలో 123,907 సర్వైకల్ క్యాన్సర్ కేసులు, 77,348 మరణాలు నమోదయ్యాయి. రొమ్ము క్యాన్సర్ తర్వాత, గర్భాశయ క్యాన్సర్ భారతదేశంలో మధ్య వయస్కులైన మహిళలను ప్రభావితం చేసే రెండవ అతి ప్రమాదకరమైన క్యాన్సర్" అని పీఆర్ ఏజెన్సీ ప్రకటనలో తెలిపింది.
దేశవ్యాప్తంగా సంచలనానికి కారణైన ఈ ఘటన మీద పీఆర్ ఏజెన్సీ మాట్లాడుతూ.. "మీలో చాలా మందికి తెలియకపోవచ్చు కానీ స్వయంగా పూనమ్ తల్లి క్యాన్సర్‌తో ధైర్యంగా పోరాడింది. దీనివల్లే పూనమ్ వ్యక్తిగతంగా ఆ బాధలను సన్నిహితంగా చూసింది కాబట్టే.. వ్యాధితో పోరాడటంలో ఉన్న సవాళ్లు తెలుసుకాబట్టే.. నివారణ ప్రాముఖ్యతను, అవగాహన క్లిష్టతను అర్థం చేసుకుంది. ముఖ్యంగా ఈ క్యాన్సర్ కు టీకా అందుబాటులో ఉందని తెలుసు"అని తెలిపింది.
శుక్రవారం సర్వైకల్ క్యాన్సర్ తో పాండే మరణించిందని ప్రకటన రాగానే.. మీడియా సంస్థలు అనుమానించాయి. కానీ పూనమ్ పాండే వికీపీడియా పేజీ కూడా ఆమె మరణాన్ని ప్రతిబింబించేలా అప్ డేట్ చేశారు. బాలీవుడ్ తారలు సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. అయితే, నాలుగు రోజుల క్రితం గోవాలో పడవలో ఆరోగ్యంగా ఉన్న పాండే ఫుటేజీని ఆమె ఖాతాలో పోస్ట్ చేయడాన్ని గమనించిన తర్వాత సందేహాలు వ్యక్తం అయ్యాయి.
ప్రకటన వెలువడిన రెండో రోజు 32 ఏళ్ల పూనమ్ తన మరణం ఫేక్ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన మరొక వీడియోలో తెలిపింది. ఇన్ స్టాలో ఆమెకు 1.3 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. "నేను నా మరణాన్ని ఫేక్ చేసానని నాకు తెలుసు. దీనివల్ల సడెన్ గా దేశం మొత్తం ఒక్కసారి గర్భాశయ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాం. కదా?" "నా మరణ వార్త ఏం సాధించిందో.. దానితో నేను గర్వపడుతున్నాను" అని పూనమ్ పాండే అన్నారు.