Asianet News TeluguAsianet News Telugu

అభిమానులకు, శ్రేయోభిలాషులకు పవన్‌ థ్యాంక్స్.. ఇంతకి ఏమన్నాడంటే?

పవన్‌ కి అభినందనల వర్షం కురిసిందనే చెప్పాలి. ఇక తనపై చూపిస్తున్న ఇంతటి అభిమానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

power star pawan kalyan said big thnks to every one
Author
Hyderabad, First Published Sep 2, 2020, 9:19 PM IST

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ బర్త్ డే హంగామాకి ఇక తెరపడినట్టే. నిన్నటి నుంచి తెగ హడావుడి చేశారు. సోషల్‌ మీడియాలో మొత్తం పవన్‌ నామస్మరణమే. ట్విట్టర్‌ `హ్యాపీబర్త్ డే పవన్‌ కళ్యాణ్‌` యాష్‌ ట్యాగ్‌తో ట్రెండ్‌ అయ్యింది. మరోవైపు ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ బ్యాక్‌ టూ బ్యాక్‌ అందిస్తూ అభిమానులను ఖుషీ చేశాయి చిత్ర యూనిట్స్. `వకీల్‌ సాబ్‌` మోషన్‌ పోస్టర్‌ ఏకంగా నెంబర్‌ 1గా ట్రెండ్‌ అవుతుంది. సెలబ్రిటీల విశెష్‌లు వెల్లువలా వచ్చాయి. 

దీంతో పవన్‌ కి అభినందనల వర్షం కురిసిందనే చెప్పాలి. ఇక తనపై చూపిస్తున్న ఇంతటి అభిమానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో పవన్‌ చెబుతూ, దేశ ప్రజలు కరోనా వల్ల చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. ఈ మాయదారి రోగం ఎవరిని కబళిస్తుందో అని బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. చేతి వృత్తులవారు, చిరు వ్యాపారులు, ఏరోజుకారోజు సంపాదించుకునే కార్మిక, కర్షకులు, అల్ఫాదాయ వర్గాల వారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు ఆర్థికంగా అణగారిపోతున్నారని వాపోయారు. 

ఇంకా చెబుతూ, ముందు వరుసలో ఉండి వైరస్‌పై పోరాటం చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఇతర ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. మన ముందు ఉన్న పరిస్థితి ఇంత ఆందోళనకరంగా ఉంది. స్వల్ప స్థాయిలో సాయం చేయడం తప్ప ఎవరూ ఏమీ చేయలేని నిస్సహాయత. ప్రజల క్షేమాన్ని కోరి భగవంతుడిని ప్రార్తించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చాతుర్మాన్య దీక్షను ఆదరిస్తున్నాను. ఈ దీక్ష ప్రతి ఏటా చేస్తున్నదే అయినా ఈ సారి చేస్తున్న దీక్ష కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడమని భగవంతుడిని వేడుకోవడానికే. 

ఈ తరుణంలో వచ్చిన నేటి నా పుట్టిన రోజునాడు శుభాకాంక్షలు స్వీకరించడానికి కూడా మనస్సు సన్నద్ధంగా లేదు. అయినప్పటికీ నా మీద ప్రేమ, అభిమానంతో ఎంతో మంది శ్రేయోభిలాషులు, రాజకీయ నేతలు, హితులు, సన్నిహితులు, బంధువులు, సినీ తారలు, సినిమా టెక్నీషియన్లు, జనసైనికులు, అభిమానులు అనేక మంది నా మీద వారి వాత్సల్యం, అభిమానం, ప్రేమానురాగాలు వ్యక్తం చేస్తూ వివిధ రూపాలలో శుభాకాంక్షలు తెలిపారు. వారందరికి పేరు పేరునా ధన్యవాదాలు. మీ ప్రేమాభిమానాలు నా బాధ్యతను మరింత పెంపొందించాయి. కరోనా ఈతిబాధలు తొలగిపోయి సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే ఎప్పటిలాగే మీ అందరి ముందుకు వస్తానని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios