శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన సందర్భంగా నటుడు పోసాని కృష్ణమురళి సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ని నిర్వహించి మీడియాతో మాట్లాడారు.

''నాకు జీవితంలో ఎలాంటి కోరికలు లేవు.. కానీ జగన్ గెలవాలని దేవుడిని ఎంతగానో కోరుకున్నాను. ఈరోజు ఆయన గెలిచారు. 151 సీట్లు గెలిచి ముఖ్యమంత్రిగా మారారు. గతంలో జగన్ ని ఎన్నో మాటలు అన్న చంద్రబాబు గారు జగన్ కి అభినందనలు చెప్పడం సంతోషంగా అనిపించింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ పై ఎన్నో కేసులు పెట్టించారు. ఆయన అవినీతిపరుడని ఆయన్ని జైలుకి కూడా పంపించాడు. ఎంతో దుర్మార్గంగా జగన్ ని జైలుకి పంపించారు. కానీ ప్రజలు అవన్నీ అబద్దాలని తెలుసుకున్నారు.  అందుకే ఆయన్ని గెలిపించారు. ఇకనైనా చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు చేయకూడదని కోరుకుంటున్నాను. జగన్ పై పెట్టిన కేసులను చంద్రబాబు వెనక్కి తీసుకోవాలని ఆయనకి సూచిస్తున్నాను'' అంటూ చెప్పుకొచ్చారు. జగన్ మంచి ముఖ్యమంత్రిగా మిగిలిపోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.