బెంగాలీ నటి, బుల్లితెర బ్యూటీ పల్లవిడే (Pallavi Dey) ఆత్మహత్య కలకలం రేపుతోంది. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉంటున్న ఫ్లాట్ లోనే సూసైడ్ చేసుకుంది. అయితే తనది హత్యేనంటూ బంధువులు ఆరోపిస్తున్నారు.
బెంగాలీ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీరియల్ నటి పల్లవి డే ఆత్మహత్య ఇండస్ట్రీని షాక్ కు గురిచేసింది. ఇప్పటికే యువ డాన్స్ మాస్టర్ టీనా సాధు, నటి షహానాల ఆకస్మిక మరణాలను మరవకముందే మరో యాక్ట్రెస్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాకు చెందిన సీరియల్ యాక్ట్రెస్ పల్లవి పలు బెంగాలీ సీరియల్స్ లో నటించిన మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమీ సైరాజెర్ బేగం, రేష్మ జపి, కుంజో ఛాయ, సరస్వతి ప్రేమ్, మొన్ మనే నా వంటి సీరియల్స్ లో నటించి టెలివిజన్ ప్రేక్షకులకు దగ్గరైంది.
ఇదిలా ఉంటే పల్లవి గత నెలరోజులుగా తన బాయ్ ఫ్రెండ్ షగ్నిక్ తో కలిసి ఓ ఫ్లాట్ లో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో అన్యూహంగా ఆదివారం తెల్లవారు జామున ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని తన ప్రియుడు షగ్నిక్ పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం పల్లవి బాయ్ ఫ్రెండ్ సిగరెట్ తాగేందుకు బయటికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి గది లోపలి వైపు గడియ పెట్టి ఉంది. దీంతో తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లగా సీలింగ్ ఫ్యాన్ కు వేళాడుతూ కనిపించింది.
ఇదే విషయాన్ని షగ్నిక్ వెంటనే పోలీసులకు తెలియజేయడంతో వెంటనే ఫ్లాట్ వద్దకు చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ప్రాథమిక విచారణలో పల్లవి డేది ఆత్మహత్యగానే తేలింది. కానీ బంధువులు, కుటుంబ సభ్యులు మాత్రం ఇది కచ్చితంగా హత్యేనని ఆరోపిస్తున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని కోరుతున్నారు. అయితే పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలియనున్నాయని పోలీసులు తెలుపుతున్నారు.
