Asianet News TeluguAsianet News Telugu

Suvarna Sundari Review: పూర్ణ `సువర్ణ సుందరి` రివ్యూ, రేటింగ్..

`ఢీ` పూర్ణ, జయప్రద, సాయికుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `సువర్ణ సుందరి`. చాలా కాలం తర్వాత జయప్రద నటించిన తెలుగు చిత్రమిది.  ఈ శుక్రవారం(ఫిబ్రవరి 3) ఆడియెన్స్ ముందుకొచ్చింది. మరి సినిమా ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

poorna suvarna sundari movie review and rating
Author
First Published Feb 3, 2023, 4:52 PM IST

`ఢీ` పూర్ణ, జయప్రద, సాయికుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `సువర్ణ సుందరి`. చాలా కాలం తర్వాత జయప్రద నటించిన తెలుగు చిత్రమిది. సురేంద్ర మాదారపు దర్శకత్వం వహించగా, ఎంఎల్ లక్ష్మీ నిర్మించారు. హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అనేక పురిటి నొప్పులను ఎదుర్కొని ఎట్టకేలకు ఈ శుక్రవారం(ఫిబ్రవరి 3) ఆడియెన్స్ ముందుకొచ్చింది. మరి సినిమా ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? పూర్ణ, జయప్రద మెప్పించారా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

కథః
సువర్ణ సుందరి కథ అంతా కూడా త్రినేత్రి అమ్మవారి విగ్రహం చుట్టూ తిరుగుతుంది. కొన్ని వందల ఏళ్ల క్రితం తమ రాజ్యంలోని రాజు ఆజ్ఞమేరకు కంసలి ఆ విగ్రహాన్ని తయారు చేస్తాడు. అది రెండు కళ్లు మూసుకుని, మూడో కన్ను తెరిచి ఉంటుంది. అది రాజ్యానికి పెద్ద అరిష్టం. అది నిత్యం రక్తదాహాన్ని కోరుకుంటుంటుంది. ఆ విగ్రహం వల్ల అంతా వినాశనమే జరుగుతుంది. కొన్ని వంద ఏళ్లుగా లక్షల మందిని ఆ విగ్రహం బలితీసుకుంటుంది. సువర్ణ సుందరిగా పిలిచే ఆ విగ్రహంలో దుష్టశక్తి ఎలా ప్రవేశించింది? అది అసలు ఎందుకు అలా మారింది? దానికి అంజలి (పూర్ణ) ఎలా బలైంది. సాక్షి (సాక్షి చౌదరి)కి ఆ విగ్రహంతో ఉన్న సంబంధం ఏంటి? విశాలాక్షి (జయ ప్రద) ఆ సువర్ణ సుందరిని అడ్డుకునేందుకు ఏం చేసింది? ఈ కథలో పోలీస్ ఆఫీసర్ గుణ (సాయి కుమార్) పాత్ర ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

విశ్లేషణః
`సువర్ణ సుందరి` కథ అదే పేరుతో ఉన్న విగ్రహం చుట్టూ తిరుగుతుంది. విగ్రహం చూడటానికి దేవతలా ఉంటుంది, కానీ అందులో అనంతమైన దుష్ట శక్తి ఉంటుంది. దాని రక్త దాహం తీర్చుకోవడానికి రాజ్యాలను సైతం మట్టు బెట్టేస్తుంది. అది ఎవరి చేతిలో ఉంటే వారు రాక్షసుల్లా మారిపోతారు. చుట్టు పక్కల ఉన్న వారిని చంపేసి రక్తం దాహం తీర్చుకుంటారు. కథ పరంగా ఇదొక సంక్లిష్టమైన కథ. దాన్ని వెనక్కి ముందుకు నడిపించి ఉత్సుకత పెంచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఇలాంటి సినిమాల్లో స్క్రీన్‌ ప్లే చాలా ముఖ్యం. అది ఆడియెన్స్ కి అర్థమైతే ఓకే, లేదంటే కన్ ఫ్యూజ్‌ క్రియేట్‌ అవుతుంది. సినిమా గందరగోళంగా తయారవుతుంది. ఆ విషయంలో దర్శకుడు కొంత మేర సక్సెస్‌ అయ్యాడనే చెప్పాలి. అదే సమయంలో కొంత క్లారిటీ మిస్‌ అయిన ఫీలింగ్‌ కలుగుతుంది. 

దుష్టశక్తులను ఇతర భవానాల్లో సీసాల్లో, భూగర్భంలో, నీటిలోనో బంధిస్తుంటారు. కానీ ఇందులో దేవతలా కనిపించే విగ్రహంలోనే దుష్టశక్తి ఉండటం ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌. కొత్తగానూ ఉంది. దీన్ని హర్రర్‌, థ్రిల్లర్‌ ఎలిమెంట్లు జోడించి, సూపర్‌నేచురల్‌గా కథని నడిపించి తీరు బాగుంది. ఆద్యంతం ఎంగేజింగ్‌గానే నడిపించే ప్రయత్నం చేశాడు. సువర్ణ సుందరి చేసే విధ్వంసం గురించి మొదటి సీన్లోనే చూపించి అందరినీ భయపెట్టేశాడు. భయపెట్టడంలో మాత్రం సువర్ణ సుందరి సక్సెస్ అయింది. ప్రథమార్థంలో సువర్ణ సుందరి ఎంట్రీ ఇచ్చే సీన్లు బాగానే ఉంటాయి. ప్రస్తుతం అంటూ మోడ్రన్ ప్రపంచంలో చూపించే సీన్లు కాస్త స్లోగా అనిపించినా.. సువర్ణ సుందరి ఎంట్రీ ఇచ్చాక జరిగే పరిణామాలు ఎంగేజ్‌ చేస్తుంటాయి. 

ద్వితీయార్థంలోనే అసలు కథ రివీల్ అవుతుంది. సువర్ణ సుందరిని ఎలా అడ్డుకుంటారు.. అసలు సువర్ణ సుందరి నేపథ్యం ఏంటి? అనేది తెలిశాక ప్రేక్షకుడు ఆశ్చర్యపోతారు. అయితే ఈ సినిమా పాయింట్ బాగుంది. కానీ దాన్ని తెరపై ఆవిష్కరించడంలో కొంత తడబాటుతోపాటు మరికొంత సీరియస్‌ నెస్ మిస్‌ అయ్యింది. చాలా లాజిక్కులు వదిలేశారు. చాలా ప్రశ్నలకు సమాధానం లేకుండా కథ ముగుస్తుంది. ఓవరాల్‌గా కన్‌ క్లూజన్‌ ఇచ్చారుగానీ, సరైన ఫినిషింగ్‌ టచ్‌ ఇవ్వలేకపోయారు. అయితే క్లైమాక్స్ లో జయప్రద సన్నివేశాలు, సూపర్‌నేచురల్ పవర్‌ ఎలిమెంట్లు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. బాగా ఆకట్టుకున్నాయి. 

నటీనటులు
అంజలి పాత్రలో పూర్ణ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఎంతో నిండుగా కనిపిస్తుంది. ప్రజెంట్‌ సీన్లు వచ్చినప్పుడు ఎంతో మోడ్రన్‌గా కనిపించింది. ఆమె పాత్ర నిడివి కొద్దిసేపే అయినా అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంది.అలాగే జయప్రద చివర్లో తన మార్క్‌ని ని చాటుకుంది. అమె నటనా అనుభవం పాత్రలో కనిపిస్తుంది. సాక్షి సైతం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో అదరగొట్టేస్తుంది. సాయి కుమార్ పాత్ర కూడా ఉన్నంత సేపు ఆకట్టుకుంటుంది. మిగిలిన పాత్రలు ఫర్వాలేదనిపిస్తాయి. టెక్నీకల్‌గా చూస్తే.. సినిమాకి సంగీతం, ఆర్‌ఆర్‌ ప్రాణం. సినిమాని అంతో ఇంతో నిలబెట్టిందంటే అదే. విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు సైతం బాగున్నాయి. చిన్న సినిమాకి మించి ఖర్చు చేశారు. అయితే ఇంకాస్త సీరియస్‌గా, ఇంకాస్త డెప్త్ గా వర్క్ చేసి తీస్తే పెద్ద రేంజ్‌ సినిమా అయ్యేది. 

ఫైనల్‌గాః భయపెట్టే `సువర్ణ సుందరి`
రేటింగ్‌ః 2.75

Follow Us:
Download App:
  • android
  • ios