లఘు చిత్రాల ద్వారా క్రేజ్ తెచ్చుకున్న తెలుగమ్మాయి పూజిత పొన్నాడ ఆ తరువాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించడం మొదలుపెట్టింది. 'రంగస్థలం' సినిమాలో కీలక పాత్ర పోషించిన ఆమె 'వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి' సినిమాలో హీరోయిన్ గా కనిపించింది.

తాజాగా ఆమె '7' అనే సినిమాలో నటిస్తుంది. ఇది ఇలా ఉండగా.. ఈ భామని స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ పెళ్లి చేసుబోతున్నట్లు రూమర్లు వినిపించాయి. వీరిద్దరూ చాల కాలంగా ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వచ్చాయి.

దీనిపై స్పందించిన పూజిత ఆ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. 'రంగస్థలం' సినిమా వంద రోజుల వేడుక ముందు వరకు తాను అసలు దేవిని ఒక్కసారి కూడా కలవలేదని చెప్పింది. దేవిశ్రీ సర్ తో పెళ్లి వార్తలు విని ఆశ్చర్యపోయినట్లు చెప్పింది. అసలు ఇలాంటి వార్తలు ఎవరు సృష్టిస్తారో తెలియదు కానీ ఏకంగా ఫొటోలే మార్ఫ్ చేసి పెట్టేస్తున్నారని చెప్పింది. 

'రంగస్థలం' వంద రోజుల వేడుకలో తొలిసారి దేవిశ్రీప్రసాద్ తో మాట్లాడానని అప్పటివరకు ఆయన నన్ను చూడలేదు కూడా అంటూ చెప్పుకొచ్చింది. ఈ రూమర్ వచ్చి ఆరు నెలలు దాటిపోతుందని, అసలు నేనెప్పుడూ కలవని, మాట్లాడని వ్యక్తితో ఇలాంటి రూమర్స్ ఎలా రాస్తారని అసహనానికి లోనైంది. మొదట్లో ఇలాంటి రూమర్స్ విని బాధపడేదాన్ని అని చెప్పిన ఈ బ్యూటీ ఇప్పుడు మాత్రం వాటి వలన పాపులారిటీ వస్తుంది కాబట్టి హ్యాపీగా ఉన్నానని షాక్ ఇచ్చింది.