స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సినిమా వెనుక ఎంతోమంది కష్టం ఉంటుందని, పైరసీని ప్రోత్సహించవద్దని కోరారు. ఇది విజయ్ గారి చివరి సినిమా కాబట్టి, అందరూ థియేటర్లలోనే చూసి గౌరవించాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
'జన నాయగన్' సినిమా ఆన్‌లైన్‌లో లీక్ అయ్యిందన్న వార్తలు రాగానే..సెలబ్రిటీలంతా స్పందిస్తున్నారు. పైరసీపై స్టార్ హీరోలు కూడా తమ గళం విప్పారు. ఇక ఈసినిమాలో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే కూడా ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. సినిమాను థియేటర్లలోనే చూడాలని అభిమానులను కోరింది పూజా హెగ్డే. . తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లోని చాలామంది నటులు ఆమెకు సపోర్ట్ గా నిలిచారు.
మనసు చాలా నొచ్చుకుంది - పూజా హెగ్డే
శనివారం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పూజా హెగ్డే ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఒక సినిమా తీయడం వెనుక ఎంత కష్టం, త్యాగం ఉంటాయో వివరించే ప్రయత్నం చేసింది. . ‘’ సినిమా లీక్ అవ్వడం మొత్తం టీమ్‌కు "గుండె పగిలినంత పని చేసింది. నా ప్రియమైన ప్రేక్షకులారా, ఒక సినిమా అంటే కొన్ని వందల గంటల కష్టం, సృజనాత్మక సవాళ్లు, వ్యక్తిగత త్యాగాలు. మీకు మంచి అనుభూతిని ఇవ్వాలని రోజూ కష్టపడిన ఒక టీమ్ శ్రమ. అలాంటి మా సినిమా ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం చూస్తే చాలా బాధగా ఉంది. ఇది నా ఒక్కదానికే కాదు, దీని కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరికీ అంతే బాధ కలిగిస్తుంది," అని ఆమె పేర్కొన్నారు.
పైరసీ వల్ల కళాకారులకు, టెక్నీషియన్లకు దక్కాల్సిన గౌరవం దక్కదని పూజా హెగ్డే అన్నారు. ఇది నటుడు విజయ్ గారి చివరి సినిమా కాబట్టి, దాన్ని పెద్ద తెరపై సరైన రీతిలో సెలబ్రేట్ చేసుకుందామని ప్రేక్షకులను కోరారు. ఆమె మాట్లాడుతూ.. "సినిమాను అక్రమంగా షేర్ చేస్తుంటే చూడటం కష్టంగా ఉంది. ఇది కేవలం కలెక్షన్ల విషయం కాదు. సినిమా కోసం పనిచేసిన ప్రతీ కళాకారుడికి, టెక్నీషియన్‌కు దక్కాల్సిన గౌరవాన్ని లాగేసుకోవడమే. అసలు, విజయ్ సర్ చివరి సినిమాను మనమందరం కలిసి పెద్ద తెరపై ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలి కదా? కాబట్టి, దయచేసి సరైన మార్గంలోనే చూద్దాం. కొంచెం ఓపిక పడదాం. సరైన టైమ్‌కి సినిమా రిలీజ్ అవుతుంది. పైరసీని ప్రోత్సహించొద్దు. అప్పుడే సినిమా, కళ బతుకుతాయి. మీ ప్రేమతో, కళ. కళాకారులు. టెక్నీషియన్లు," అని పూజా రాశారు.
కఠిన చర్యలు తప్పవు.. నిర్మాతల వార్నింగ్..
ఈ విషయంలో అంతకు ముందే సినిమా నిర్మాతలైన KVN ప్రొడక్షన్స్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. లీకైన క్లిప్పులను చూడవద్దని, షేర్ చేయవద్దని ప్రజలను కోరింది. సినిమాలోని కొన్ని భాగాలు, కొన్నిచోట్ల దాదాపు సినిమా మొత్తం సోషల్ మీడియా, ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో అక్రమంగా వ్యాప్తి చెందుతున్నాయని నిర్మాణ సంస్థ తెలిపింది. ఇది చాలా తీవ్రమైన డిజిటల్ పైరసీ కేసు, దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీమ్ హెచ్చరించింది. రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో వెళ్లే ముందు విజయ్‌కి ఇదే చివరి సినిమా అని చెబుతున్నారు. 'జన నాయగన్', సెన్సార్ సమస్యల వల్ల ఇప్పటికే రిలీజ్ ఆగిపోయింది. నిజానికి జననాయగన్ జనవరి 9న పొంగల్ సందర్భంగా విడుదల కావాల్సి ఉంది.


