మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి చిత్రం రేపు(సెప్టెంబర్ 20న) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ పెద్ద షాక్ తగిలింది. భద్రతాకారణాల రీత్యా అనంతపురం, కర్నూలు జిల్లాలో వాల్మీకి చిత్ర విడుదలని ఆపివేస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. 

హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్మీకి చిత్రం సెప్టెంబర్ 20న విడుదలకు అంతా సిద్ధం చేసుకుంది. మరికొన్ని గంటల్లో యుఎస్ లో ప్రీమియర్ షోలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ చిత్రానికి పెద్ద షాక్ ఇచ్చారు. 

వాల్మీకి చిత్ర టైటిల్ ప్రకటించినప్పటి నుంచి వాల్మీకి, బోయ సామజిక వర్గ ప్రజలు ఈ చిత్రంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కర్నూలు, అనంతపురం రెండు జిల్లాలో బోయ సామజిక వర్గ ప్రజలు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు. చిత్రం ఈ రెండు జిల్లాలో విడుదలైతే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయనే సమాచారంతో రెండు జిల్లాల కలెక్టర్లు పోలీసులకు ఆదేశాలు జారీ చేసారు. 

దీనితో ఈ రెండు జిల్లాల ఎస్పీలు చిత్ర విడుదలని నిలిపివేస్తూ థియేటర్స్ యాజమాన్యాలకు ఆదేశాలు పంపారు. ఆదేశాల్ని ధిక్కరించి చిత్ర ప్రదర్శన చేస్తే కఠినచర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఓ కమర్షియల్ చిత్రానికి వాల్మీకి టైటిల్ పెట్టడం ఏంటని, తమ మనోభావాలు దెబ్బ తిన్నాయని బోయ సామజిక వర్గ ప్రజలు ఈ చిత్రాన్ని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. 

వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రాన్ని తమిళ చిత్రం జిగర్తాండ కు రీమేక్ గా తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం ఈ చిత్రం విడుదల కానుంది.