తమిళంలో బిగ్ బాస్ మూడో సీజన్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ హౌస్ లోకి ఒకసారి పోలీసులు ప్రవేశించారు. సీజన్ 3లో కంటెస్టంట్ గా పాల్గొన్న నటి వనితా విజయ్ కుమార్ తన కూతురిని కిడ్నాప్ చేసిందన్న ఆరోపణతో హైదరాబాద్ పోలీసులు, చెన్నై పోలీసులు విచారణలో భాగంగా బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించారు. ఆ సమయంలో వనితని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది.

అయితే తన కూతురు వాగ్మూలంతో వనిత అరెస్ట్ నుండి తప్పించుకుంది. తాజాగా నటి మీరా మిథున్ డబ్బు మోసం కేసులో పోలీసులు బిగ్ బాస్ హౌస్ లోకి మరోసారి ప్రవేశించారు. ఈ గేమ్ షోలో పాల్గొన్న మీరా మిథున్ ఇటీవల దక్షిణ భారత అందాల పోటీలను నిర్వహించడానికి ప్లాన్ చేసి వివాదాలపాలయ్యింది. అందాల పోటీల సమయంలో ఓ  వ్యక్తికి డిజైనర్ గా ఛాన్స్ ఇస్తానని చెప్పి అతడి నుండి యాభై వేల రూపాయలు తీసుకుందట.

కానీ అతడికి పని ఇవ్వలేదట. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసు విచారణలో ఉంది. దీంతో మీరా మిథున్ పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా చెన్నై హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకుంది. అందులో తాను మోసం చేశానన్న ఆరోపణలో నిజం లేదని.. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నానని.. బయటకి రాగానే  తనపై కేసును చట్టపరంగా ఎదుర్కొంటానని పోలీసుల విచారణకు సహకరిస్తానని చెప్పింది.

దీంతో కోర్టు ఆమెకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే సడెన్ గా పోలీసులు గురువారం నాడు మీరా మిథున్ ని విచారించడానికి బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించారు. దీంతో ఆమె అరెస్ట్ తప్పదనే ప్రచారం మొదలింది. అయితే పోలీసులు మాత్రం ఆమెను అరెస్ట్ చేసే విషయాన్ని నిర్ధారించలేదు.