పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' సినిమా దర్శక నిర్మాతల మీద ఊహించని కేసు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాడిన 'కొడకా కోటేశ్వరరావు' అనే పాటను వెంటనే నిషేధించాలని, సినిమా నుండి తొలగించాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. ఈ పాట వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కోటేశ్వ‌ర‌రావు అనే పేరు గల వ్యక్తుల పరువు పోతోందని, కోటేశ్వ‌ర‌రావు పేరుగ‌ల వారి మ‌నోభావాలు దెబ్బ‌తింటున్నాయని.. విజయవాడకు చెందిన కోటేశ్వ‌ర‌రావు అనే న్యాయ‌వాది ఈ పాట‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ మాచ‌వ‌రం పోలీస్ స్టేష‌న్‌లో ఆయ‌న‌ ఫిర్యాదు చేశారు.

 

సినిమా గురించి పెద్దగా తెలియదు కానీ రోజూ కోర్టుకు వెళ్లి వస్తుంటే అందరూ పరువు తీస్తున్నారు. ఈ మ‌ధ్య మా అన్న‌య్య పిల్ల‌లు, అక్క‌య్య పిల్ల‌లు మా ఇంటికి వ‌చ్చారు. వారు మ‌న బాబాయి పేరు కోటేశ్వ‌ర‌రావు క‌ద‌రా అని మాట్లాడుకుంటున్నారు. నా ముందే కొడ‌కా కోటేశ్వ‌ర‌రావు అని పాట పాడుతున్నారు. నాకు చాలా బాధేసింది. అని కోటేశ్వర రావు ఆవేదన వ్యక్తం చేశారు.

 

పిల్లలను భావి పౌరులుగా తీర్చిద్దే టీచర్లు ఎంతో మంది కోటేశ్వరరావు అని పేరు గలవారు ఉంటారు. ఈ పాట మూలంగా వారు తలెత్తుకుని స్కూలుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. పిల్లలు ఎగతాళి చేస్తోంటే బ్రతికేదెలా? వెంటనే ఈ పాటను తొలగించాలి, బ్యాన్ చేయాలి. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల్లోని కోటేశ్వరరావులు అంతా ఏకం కావాలి అని న్యాయవాది కోటేశ్వరరావు కోరారు.

 

తమ అభిమాన హీరో సినిమాపై, అందులో తమకు ఇష్టమైన పాటపై ఇలాంటి కేసు నమోదు కావడంపై అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇలా అయితే సినిమాలు తీయలేమని, ఈ కేసును అంగీకరిస్తే ఇక ప్రతి సినిమాపై కేసులు వేసే అవకాశం ఏర్పడుతుందని అంటున్నారు. ‘కొడకా కోటేశ్వరరావు' పాటకు విదేశాల్లో సైతం మంచి క్రేజ్ ఉందని, మన భాష తెలియని కుర్రాళ్లు కూడా పవన్ కళ్యాణ్ పాడిన పాటకు ఫిదా అయిపోతున్నారని.. అలాంటిది మన తెలుగు వాళ్లు ఇలా అభ్యంతరం తెలపడం ఏమిటని కొందరు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

ఈ పాటను యూకెలో ఉంటున్న పోలండ్ బుజ్జిగాడు పాడటం సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసింది. తెలుగు తెలియని 8 ఏళ్ల జెబిగ్స్ బుజ్జి అనే తెల్లజాతి కుర్రాడు ముద్దు ముద్దుగా ఆ పాట పాడటం అందరినీ ఆకట్టుకుంది. పోలండ్ బుజ్జిగాడు పాడిన పాటకు ఫిదా అయిన పవన్ కళ్యాణ్ కూడా.. "డియర్ జెబిగ్స్ బుజ్జీ... మై డియర్ లిటిల్ ఫ్రెండ్, పాట రూపంలో నువ్విచ్చిన న్యూ ఇయర్ గిఫ్టుకు థాంక్స్. నువ్వు పంపిన సందేశం నాకు చేరింది. గాడ్ బ్లెస్ యూ'' అంటూ ట్విట్టర్ ద్వారా రిప్లై ఇచ్చారు.

 

డిసెంబర్ 31న నూతన సంవత్సరం కానుకగా ఈ పాట విడుదలవ్వగా ఇప్పటికే 10 మిలియన్ పైగా హిట్స్ వచ్చాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అజ్ఞాతవాసి' సినిమా జనవరి 10న విడుదల కాబోతోంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. కుష్భూ, రావు రమేష్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘జల్సా', ‘అత్తారింటికి దారేది' చిత్రం భారీ విజయం అందుకున్నారు. ఈ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమాతో వీరు హాట్రిక్ కొట్టడం ఖాయం అంటున్నారు.