కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో ఓటీటీల హవా కనిపిస్తోంది. లో బడ్జెట్‌ సినిమాలతో పాటు చాలా కాలంగా రిలీజ్‌ పెండింగ్‌లో ఉన్న సినిమాలు కూడా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. తాజాగా అలాంటి సినిమానే ఒకటి థియేటర్లలోకి వచ్చింది. మూడేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా సినిమాను ఓటీటీ ప్లాట్‌ ఫాంలో రిలీజ్ చేశాడు రానా. ఈ సినిమా గురువారం నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా రిలీజ్‌ అయ్యింది. రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు మిక్స్‌డ్‌ రెస్సాన్స్‌ వస్తోంది.

అయితే ఈ సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలోని హీరోయిన్లకు హిందూ దేవతల పేర్లు పెట్టడంతో వాళ్లు మితిమీరి రొమాంటిక్‌ సీన్స్‌లో నటించటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ రాకేష్‌ అనే వ్యక్తి సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన కంప్లయింట్‌తో సినిమాను వెంటనే ఆన్‌లైన్‌ నుంచి తొలగించాలని కోరాడు రాకేష్‌.

ఇక సినిమా విషయానికి వస్తే గుంటూరు టాకీస్‌, గరుడవేగ సినిమాలతో ఆకట్టుకున్న సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కృష్ణ అండ్‌ హిజ్‌ లీల. రానా దగ్గుబాటి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్‌, వయాకామ్‌ 18 స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్‌, సీరత్‌ కపూర్‌, షాలిని వాడ్నికట్టిలు కీలక పాత్రల్లో నటించారు. లాక్‌ డౌన్‌ కాలంలో చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్‌ అయినా కాస్త పాజిటివ్‌ టాక్‌ వచ్చిన సినిమా ఇదొక్కటే కావటం విశేషం.