ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తోంది. స్పోర్ట్స్, సినిమాలు, రాజకీయాలకు సంబంధించిన పలువురు ప్రముఖుల బయోపిక్స్ ని చిత్రాలుగా రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే చాలా బయోపిక్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

తాజాగా మరో బయోపిక్ సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా సినిమాని రూపొందిస్తున్నారు. ఒమంగ్ కుమార్ బీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

సోమవారం నాడు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్ లో వివేక్ ఒబెరాయ్ అచ్చం నరేంద్ర మోదీని తలపిస్తున్నారు. 'దేశ భక్తే నా శక్తి' అని ఈ సినిమాకి క్యాప్షన్ పెట్టారు.

హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, గుజరాతీ, బెంగాలీ, ఉర్దూ భాషల్లో ఈ పోస్టర్ ని విడుదల చేశారు. సురేష్ ఒబెరాయ్, సందీప్ శర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.