కళాతపస్వి కె విశ్వనాథ్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం..
లెజెండరీ దర్శకుడు, కళాతపస్వి కె విశ్వనాథ్ మరణంతో టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొన్ని రోజులు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

లెజెండరీ దర్శకుడు, కళాతపస్వి కె విశ్వనాథ్ మరణంతో టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొన్ని రోజులు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. విశ్వనాథ్ మృతిపై పలువురు ప్రముఖులు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కె విశ్వనాథ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా సంతాపం తెలియజేశారు. విశ్వనాథ్ మృతి బాధకరమని పేర్కొన్న మోదీ.. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
‘‘కె విశ్వనాథ్ మృతిపట్ల విచారం వ్యక్తంచేస్తున్నాను. అతను సినీ ప్రపంచంలో ఒక దిగ్గజం, సృజనాత్మక దర్శకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సినీలోకంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. వివిధ ఇతివృత్తాలతో తీసిన అతని సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించాయి. అతని కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఇక, ప్రస్తుతం విశ్వనాథ్ భౌతికకాయాన్ని ఆయన నివాసంలో ఉంచారు. విశ్వనాథ్ భౌతికకాయానికి సినీ ప్రముఖులు చిరంజీవి, పవన్ కల్యాణ్, వెంకటేశ్, బ్రహ్మనందం, త్రివిక్రమ్, రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, రాధిక, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. తదితరులు నివాళులర్పించారు.
ఈ రోజు పంజాగుట్ట శ్మశాన వాటికలో కే విశ్వనాథ్ అంత్యక్రియలను నిర్వహించనున్నట్టుగా నటుడు ఏడిద రాజా తెలిపారు. ఉదయం 11 గంటలకు ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానున్నట్టుగా చెప్పారు.