బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ 'భరత్ అనే నేను' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తరువాత 'వినయ విధేయ రామ' చిత్రంలో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఆమె నటించిన 'కబీర్ సింగ్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా ఆమె తన కెరీర్ లో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి చెప్పుకొచ్చింది. తను బాలీవుడ్ లో నటించిన మొదటి చిత్రం 'ఫుగ్లీ' ఫ్లాప్ అవ్వడంతో తనతో కలిసి పని చేయడానికి ఇండస్ట్రీ వాళ్లు ఆలోచించేవారని, ఆ సమయంలో అవకాశం ఇవ్వమని ఎందరో దర్శకులను కలిసేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది.

అయినా వారెవరూ తనను ప్రాజెక్ట్ లోకి తీసుకునేవారు కాదని, కానీ ఇప్పుడు ఆ దర్శకులే తనతో కలిసి పని చేస్తున్నారని తెలిపింది. 'ఎంఎస్ ధోనీ' సినిమా తరువాత తన కెరీర్ లో మార్పు వచ్చిందని, ప్రజలు తనను గుర్తించారని అంది.

అన్ని సినిమాలకు డేట్స్ ఇవ్వడం కష్టమే అయినా.. మంచి ప్రాజెక్ట్ లలో నటించడానికి ఎక్కువగా కష్టపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా  ఇండియాలోని అన్ని భాషల్లో నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై కనిపించడానికి కూడా సిద్ధమంటూ చెప్పుకొచ్చింది.