సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ప్రమోషన్స్ సమయంలో 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమాను తీయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఆ సమయంలో ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. వర్మకి ఇలా సినిమాలు అనౌన్స్ చేయడం కామనే అని, పబ్లిసిటీ కోసం చెబుతున్నాడని అనుకున్నారు. 

కానీ సడెన్ గా సినిమాలో పాట విడుదల చేయబోతున్నట్లు చెప్పి షాకిచ్చాడు. నిన్న సినిమాలో మొదటి పాటని విడుదల చేశారు. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు..' అంటూ సాగే ఈ పాటలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూపించారు. ఈ పాట వీడియో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.  

తమ వీడియో శుక్రవారం నాడు గూగల్ ట్రెండ్స్‌లో సంచలనం స‌ృష్టించిందని వర్మ ప్రకటించారు. సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా విడుదలిన 'సరిలేరు నీకెవ్వరు' ఇంట్రో  కంటే తమ పాట వీడియోకే ఎక్కువ ఆదరణ లభించిందని వర్మ ట్వీట్ చేశారు.

మహేష్ ఇంట్రో, మా పాట వీడియో ఒకేసారి విడుదలయ్యాయి. అయినప్పటికీ మా వీడియోకే ఎక్కువ స్పందన వచ్చింది. సూపర్ స్టార్ల కంటే కాస్ట్ ఫీలింగ్స్ అంటేనే ఎక్కువ ఆసక్తికరమని తేలిందని.. ఇది మంచి కాదని అన్నారు. ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో నిలిచింది.