Asianet News TeluguAsianet News Telugu

ఇక్కడ తిరస్కారం.. అక్కడ పురస్కారం

ప్రాంతీయ అవార్డుల్లో ఎంట్రీకి కూడా నోచుకోని ఓ మంచి చిత్రానికి జాతీయ పురస్కారం.  

Pellichupulu bags best telugu regional movie award

పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అనే సామెత మన టాలీవుడ్ కు బాగా  వంటపట్టింది. మన సినిమాలో తెలుగుదనం ఉండదు. నటించేవాళ్లు తెలుగువాళ్లు కాదు. పరభాషలో హిట్టైన సినిమాలు కాపీ కొట్టి కోట్లు గొల్లగొట్టడమే తప్పితే ఓ మంచి సినిమాను తీద్దాం. లేకుంటే అలా తీసిన సినిమాకైనా ప్రోత్సాహం ఇద్దాం అనే ఆలోచన మన సినిమా పెద్దలకు ఏ కోశాన ఉండదు.

 

నాలుగు ఫైట్లు, ఆరు పాటలు అనే రోటీన్ ట్రాక్ లో నే ఇంకా టాలీవుడ్ సినిమాను లాగుతూనే ఉన్నారు. దానికి భిన్నంగా ఈ మధ్య కొత్త దర్శకులు తమ సృజనాత్మకతతో మంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అవి మంచి ఫలితాలు కూడా ఇస్తున్నాయి. ఇటీవల వచ్చిన ఘాజీ, పెళ్లిచూపులు, అప్పట్లో ఒకడుండేవాడు అలాంటి చిత్రాలకు ఇందుకు ఉదాహారణలు.

 

ఇక పెళ్లిచూపులు సినిమా విషయానికి వస్తే చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన సినిమా ఇది. యూత్ కు ముఖ్యంగా మల్టీప్లెక్స్ లో చూసే హైటెక్ జనాలకు బాగా కనెక్ట్ అయింది. నిర్మాతలకు కనవర్షం కూడా కురిపించింది. ఇండియాలోనే కాదు ఓవర్స్సీస్ లోనూ అదరగొట్టేసింది. శాటిలైట్ రేటు కూడా బాగానే దక్కించుకుంది. షార్ట్ ఫిల్మ్ గా వచ్చిన కథనే మళ్లీ సినిమాగా తీసినా మంచి కథ కావడంతో జనాలు బాగానే ఆదరించారు. అయితే ఈ సినిమాకు టాలీవుడ్ లో అనుకున్నంత ప్రోత్సాహం మాత్రం దక్కలేదు.

 

నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సురేష్ బాబు హ్యాండిల్ చేస్తే కాని ఇది పట్టాలెక్కలేదు. జనాలు ఆదరించినా అవార్డు కమిటీలు మాత్రం సినిమాను లైట్ గానే తీసుకున్నాయి. ఇటీవల చాలా ప్రాంతీయ అవార్డులు ప్రకటించినా అందులో పెళ్లిచూపులు సినిమాకు ఒక్క అవార్డు కూడా దక్కలేదు.

 

అయితే ఇక్కడ తిరస్కారానికి గురైన ఓ మంచి సినిమాకు మాత్రం చివరకు న్యాయం జరిగింది. జాతీయ స్థాయిలో తెలుగులో ఉత్తమ చిత్రంగా ఈ చిన్న సినిమా ఎంపికైంది. అంతేకాదు ఇదే సినిమాకు సంభాషణలు అందించిన తరుణ్ భాస్కర్ కు ఉత్తమ సంభాషణల అవార్డు దక్కడం విశేషం.

Follow Us:
Download App:
  • android
  • ios