సారాంశం
శ్రీకాంత్ అడ్డాల రూట్ మార్చి `పెదకాపు` చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం కలెక్షన్లు షాకిస్తున్నాయి.
ఫ్యామిలీ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల(Srikanth Addala). `కొత్త బంగారు లోకం`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` వంటి ఫ్యామిలీ చిత్రాలతో మెప్పించారు. ఆ మధ్య రీమేక్ `నారప్ప`తో టర్న్ తీసుకున్నారు. యాక్షన్ సినిమా చేసి ఆకట్టుకున్నారు. దీంతో పూర్తిగా రూట్ మార్చి కొంత పంథాలో తానేంటో నిరూపించుకునేందుకు వచ్చారు. తాజాగా ఆయన `పెదకాపు` (Peddhakapu1) చిత్రాన్ని రూపొందించారు.
ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ స్థాపించినప్పుడు లంక గ్రామాల్లోని ఓ గ్రామంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన ` పెదకాపు` చిత్రాన్ని తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి `స్కంద`, `చంద్రముఖి 2` కంటే ఈ చిత్రానికే హైప్ ఎక్కువగా ఉంది. సినిమాలోని డైలాగులు ఆ రేంజ్‌లో ఉన్నాయి. పైగా శ్రీకాంత్ అడ్డాల ఈ స్టయిల్‌లో ట్రై చేయడం, కాస్త పచ్చిగా సినిమాని తెరకెక్కించినట్టుగా టీజర్, ట్రైలర్ లు చూస్తే అనిపించింది. దీంతో ఒకింత క్రేజ్ నెలకొంది.
దీనికితోడు.. ముందుగానే స్పెషల్ ప్రీమియర్స్ వేశారు. పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. సినిమా అద్బుతంగా ఉందనే పోస్ట్ లు పెట్టించారు. పెయిడ్ పోస్ట్ లతో సినిమాని మరింతగా లేపే ప్రయత్నం చేశారు. అది మంచి ఓపెనింగ్స్ ని తీసుకొస్తుందని భావించారు. కానీ ప్లాన్ బెడిసికొట్టింది. తీరా శుక్రవారం విడుదలైన సినిమాకి పూర్తిగా నెగటివ్ టాక్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే డిజాస్టర్ టాక్ ఫస్ట్ షో నుంచే వినిపించింది. సినిమా కేవలం టీడీపీ కోసం తీశారని, టీడీపీ ప్రొపగండా మూవీ అని తేల్చేశారు.
మరోవైపు సినిమాగా ఆకట్టుకునేలా తెరకెక్కించలేకపోయారు శ్రీకాంత్ అడ్డాల. అర్థమయ్యేలా తీయలేకపోయాడు. అసలు ఆ ఊర్లో ఏం జరుగుతుందో? ఇద్దరు నాయకులు ఎందుకు కొట్టుకుంటారో, తమ కింద పనిచేసే వాళ్లని ఎందుకు చంపుతున్నారో, పెదకాపు ఆవేదన ఏంటో క్లారిటీ లేదు. ఏ పాత్ర ఎందుకొస్తుంది, ఎందుకు పోతుంది, దాని లక్ష్యం ఏంటో అర్థం కాదు, థియేటర్లో కూర్చున్న ఆడియెన్స్ పిచ్చోడై సినిమాని చూసే పరిస్థితి. సినిమాలో ఏం జరుగుతుందో తెలియక, తాము సినిమాకి ఎందుకొచ్చామో తెలియక ఆడియెన్స్ జుట్టుపీక్కునేలా సాగడం గమనార్హం. సినిమాలో ఆకట్టుకునే అంశం.. ఛోటాకే నాయుడు సినిమాటోగ్రఫీ. మిక్కీ జే మేయర్ బీజీఎం. విరాట్ కర్నా నటన. డైలాగులు. కానీ ఇవేవీ సినిమాని కాపాడలేవనేది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇది సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. మొదటి రోజు కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. ఈ చిత్రానికి తొలి రోజు కోటి రూపాయలు కూడా రాలేదు. ఎంత బజ్ ఉన్నా కొత్త కుర్రాడు, పైగా డివైడ్ టాక్ రావడం, వినాయక నిమజ్ఞనం వంటివి సినిమాని గట్టిగా దెబ్బకొట్టాయి. తొలి రోజు ఈ చిత్రానికి ముప్పై లక్షల షేర్ వచ్చిందని ట్రేడ్ వర్గాల టాక్. రెండో రోజు శనివారం కూడా ఈ సినిమా ఏమాత్రం పుంజుకోలేదని తెలుస్తుంది. వీకెండ్‌లో అయినా సినిమా బెటర్‌గా సత్తా చూపించాలి. అక్కడే డీలా పడితే అది అతిపెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోతుంది.
ఇక `అఖండ` వంటి బ్లాక్ బస్టర్ సినిమాని నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డి తన మేనల్లుడు విరాట్ కర్నాని హీరోగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుమారు 13కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. సుమారు రూ.12కోట్ల బిజినెస్ అయ్యిందని సమాచారం. ఈ లెక్కన ఈ చిత్రం పూర్తి రన్‌లో రెండు కోట్లు కూడా కలెక్షన్ల(షేర్)ని సాధించడం కష్టమని చెబుతున్నారు ట్రేడ్ పండితులు. బిజినెస్ పరంగా, ఓటీటీ రైట్స్ పరంగా సినిమా విషయంలో నిర్మాత సేఫే, కానీ కొన్న బయ్యర్లు మాత్రం దారుణాతి దారుణంగా నష్టపోవడం ఖాయమంటున్నారు.