‘అజ్ఞాతవాసి’ టాక్ మిక్స్ డ్ గా రావటంతో.. నిన్నటివరకు ‘అజ్ఞాతవాసి’పై నిరుత్సాహంగా ఉన్న పవన్ ఫ్యాన్స్‌ కు ఓవర్సీస్ వసూళ్ల లెక్కలు ధైర్యాన్నిస్తున్నాయి. టాక్ తో సంబంధం లేకుండా ఓవర్‌సీస్‌లో మాత్రం అజ్ఞాతవాసి సినిమా కలెక్షన్లు కుమ్మేస్తోంది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఇది సరికొత్త రికార్డుగా నిలిచిపోనుంది.


విక్టరీ వెంకటేష్ సీన్లను కలిపిన తర్వాత ‘అజ్ఞాతవాసి’ ఓవర్‌సీస్‌లో ఏకంగా 2 మిలియన్ డాలర్ల మార్క్ దాటి కలెక్షన్లు సాధించింది. ఇప్పటివరకు విడుదలైన పవన్ సినిమాలేవీ ఇంత కలెక్షన్లు రాబట్టకపోవడం గమనార్హం. అమెరికాలో ఎన్నడూలేని విధంగా ఒక భారతీయ చిత్రాన్ని అత్యధిక స్క్రీన్లపై విడుదల చేయటమే ఇంతగా కలెక్షన్లు రావడానికి అసలు కారణమనే టాక్ వస్తోంది.

 

మొదటి రోజు నుంచే యుఎస్ సహా ఓవర్సీస్ లో పవన్ అజ్ఞాతవాసి సినిమాకు భారీగా కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. పైగా ‘జైసింహ’, ‘గ్యాంగ్’ వంటి చిత్రాలేవీ అక్కడ పెద్దగా పోటీనివ్వకపోవడంతో ‘అజ్ఞాతవాసి’కి కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. అలాగే, ఈ సినిమా మాస్ కంటే క్లాస్‌కే ఎక్కువగా నచ్చుతోందనే టాక్ కూడా ఉంది. మొత్తానికి ‘అజ్ఞాతవాసి’ కలెక్షన్లు పవర్ స్టార్ అభిమానులకు ఊరటనిచ్చాయనే చెప్పాలి.