పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఒకేసారి నాలుగు సినిమాలకు కమిట్‌ అయి సంచలనం సృష్టించారు పవన్‌ కళ్యాణ్‌. దీంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. అందులో భాగంగా మొదటగా `వకీల్‌ సాబ్‌`ని పూర్తి చేయనున్నారు. ఇది బాలీవుడ్‌ చిత్రం `పింక్‌`కి రీమేక్‌ అనే విషయం తెలిసిందే. 

కరోనా లాక్‌ డౌన్‌తో ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ఈ ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభించారట. పాతబస్తీలో పవన్‌, ఇతర ముఖ్య తారాగణంపై కోర్ట్ సీన్‌ వంటి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వరుసగా పది రోజులు పవన్‌ ఈ షూటింగ్‌లో పాల్గొంటారట. ఆ తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకుని మళ్ళీ షూటింగ్‌లో జాయిన్‌ అవుతారని తెలుస్తుంది. డిసెంబర్‌ వరకు సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. షూటింగ్‌కి సంబంధించి తాజాగా ఓ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

ఇక వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పవన్‌ సరసన శృతి హాసన్‌ కనిపించనున్నారు. బోనీ కపూర్‌ సమర్పణలో దిల్‌రాజు ఈ సినిమాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రెండేళ్ల తర్వాత పవన్‌ రీఎంట్రీ ఇస్తూ నటిస్తున్న తొలి చిత్రం కావడంతో దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.