అత్తారింటికి దారేది చిత్రంతో తొలిసారి వంద కోట్ల క్లబ్‌ లో తెలుగు సినిమా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో జల్సా, అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్స్ మరో హిట్ తో హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్న కాంబో ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ 150 కోట్లు 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా అంటే ఏ రేంజ్ లో క్రేజ్ వస్తుందో చెప్పనవసరం లేదు. కలెక్షన్లపరంగా బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటుతాయి. వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు జల్సా, అత్తారింటికి దారేది అందుకు రుజువు. ఇక అత్తారింటికి దారేది చిత్రం తొలిసారి తెలుగు సినిమాను వంద కోట్ల క్లబ్‌లో చేర్చింది.

ప్రస్తుతం పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం విడుదలకు ముందే రికార్డు స్థాయి బిజినెస్ చేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో పవన్ కల్యాణ్ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ పాత్రను పోషిస్తున్నారు. పవన్ సరసన ఈ చిత్రంలో మలయాళ ముద్దుగుమ్మలు కీర్తీ సురేష్, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు.

ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం రూ. 150 కోట్లకుపైగా జరిగినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఏరియా హక్కుల బిజినెస్ రికార్డు స్థాయిలో ఉన్నట్టు సమాచారం. నైజాం ఏరియాను రూ.32 కోట్లకు, సీడెడ్‌లో సుమారు రూ.18 కోట్లకు, ఆంధ్ర ఏరియాను రూ.45 కోట్లకు పైగానే పలికినట్టు తెలుస్తోంది.

విడుదలకు ముందు ఈ రేంజ్‌లో బిజినెస్ జరిగిన తొలి తెలుగు చిత్రంగా బాహుబలి రికార్డ్ క్రియేట్ చేయగా... దాని తర్వాత ఆ రికార్డు పవన్‌ కల్యాణ్‌ చిత్రానికి రావడం టాలీవుడ్‌లో సంచలనం.

ప్రస్థుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం పవన్ కల్యాణ్ కెరీర్ లో 25వ సినిమా. జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాల్లో ప్రవేశించిన నేపథ్యంలో ఈ సినిమాను బ్లాక్‌బస్టర్‌గా మార్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రాజెక్ట్‌ ను అత్యంత ప్రతిష్థాత్మకంగా రూపొందించి... పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతోంది.