పవన్‌ కళ్యాణ్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో `వకీల్‌ సాబ్‌` చిత్రం రూపొందుతుంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్స్ జరుపుకుంటోంది. శృతి హాసన్‌ హీరోయిన్‌గా, అంజలి, నివేదా థామస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బోనీ కపూర్‌ సమర్పణలో దిల్‌రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అయిన `పింక్‌`కి రీమేక్‌ అన్న విషయం తెలిసిందే. 

తాజాగా ఈ చిత్రంలోని రెండోపాట `సత్యమేవ జయతే` అనే పాటని బుధవారం విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటని శంకర్‌ మహదేవన్‌ ఆలపించారు. తమన్‌ సంగీతం అందించారు. దేశ భక్తిని రగిల్చేలా, పవన్‌ హీరోయిజం హైలైట్‌ చేస్తూ `జనం మనిషి రా.. ` అంటూ ప్రారంభమైన ఈ పాట పవన్‌ అభిమానులనే కాదు, సాధారణ ఆడియెన్స్ ని కూడా ఆకట్టుకుంటుంది. యూట్యూబ్‌, సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. పవన్‌ ఫ్యాన్స్ పాటని షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు.  రెండేళ్ల గ్యాప్‌ తర్వాత పవన్‌ కళ్యాణ్‌ రీఎంట్రీ ఇస్తూ నటిస్తున్న చిత్రమిది. ఏప్రిల్‌ 9న విడుదల కానుంది.