హరి హర వీరమల్లు అప్డేట్... పుకార్లకు చెక్ పెట్టిన టీమ్, ప్రజెంట్ స్టేటస్ ఇదే!
పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న హరి హర వీరమల్లు చిత్రంపై అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో యూనిట్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. అప్డేట్ తో పవన్ ఫ్యాన్స్ లో జోష్ నింపారు.
హరి హర వీరమల్లు మూవీ సెట్స్ పైకి వెళ్లి రెండేళ్లు దాటిపోయింది. కమ్ బ్యాక్ ప్రకటించిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. అనంతరం ఆయన హరి హర వీరమల్లు పూర్తి చేయాల్సి ఉంది. అనూహ్యంగా త్రివిక్రమ్ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ తెరపైకి తెచ్చాడు. దాన్ని లైన్లో పెట్టి సెట్స్ పై ఉన్న హరి హర వీరమల్లును పవన్ కళ్యాణ్ సైడ్ చేశాడు. భీమ్లా నాయక్ గా అయ్యప్పనుమ్ కోశియుమ్ తెరకెక్కింది.
కారణం తెలియదు కానీ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు పట్ల ఆసక్తి చూపలేదు. ఉన్న సమయాన్ని మరో రీమేక్ బ్రో, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలకు కేటాయించాడు. వినోదయ సితం రీమేక్ బ్రో విడుదలైంది. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ కొంత మేర షూటింగ్ జరుపుకున్నాయి. భారీ బడ్జెట్ తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న హరి హర వీరమల్లు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
2024లో హరి హర వీరమల్లు షూటింగ్ ఉంటుందని నిర్మాతలు పరోక్షంగా హింట్ ఇచ్చారు. హరి హర వీరమల్లు చిత్రీకరణ చాలా మిగిలి ఉంది. పవన్ కళ్యాణ్ బల్క్ డేట్స్ ఇచ్చినా కంప్లీట్ చేయడానికి నెలల సమయం పడుతుంది. ఈ క్రమంలో పుకార్లు తెరపైకి వచ్చాయి. హరి హర వీరమల్లు నిర్మాతలు పవన్ ని డబ్బులు వెనక్కి ఇచ్చేయమంటున్నారని, దర్శకుడు క్రిష్ ప్రాజెక్ట్ వదిలేశాడంటూ... కథనాలు వెలువడ్డాయి.
ఈ పుకార్లకు చెక్ పెడుతూ హరి హర వీరమల్లు యూనిట్ అప్డేట్ ఇచ్చారు. హరి హర వీరమల్లు మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఇరాన్, కెనడా, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో విఎఫ్ఎక్స్ వర్క్ నడుస్తుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాను ఉన్నత నిర్మాణ విలువలతో భారీ హంగులతో తీసుకువస్తాం... అని నోట్ వదిలారు. అలాగే త్వరలో హరి హర వీరమల్లు నుండి ఒక ప్రోమో విడుదల చేయనున్నారట. నిర్మాతల ప్రకటన హరి హర వీరమల్లు పై వస్తున్న రూమర్స్ కి తెరదించింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
హరి హర వీరమల్లు మొగలుల కాలం నాటి ఫిక్షనల్ డ్రామా. పవన్ కళ్యాణ్ బందిపోటు రోల్ చేస్తున్నారు. ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తుండగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.