పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ పిఠాపురంలో మెరిశాడు. పవన్ ఆ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుపొందిన నేపథ్యంలో అకీరా నందన్ ప్రజలకు అభివాదం తెలియజేయడం విశేషం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో విజయం సాధించారు. పదేళ్ల పోరాటం అనంతరం ఆయన ఈ సారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. తన జనసేనా పార్టీ 21 స్థానాల్లో పోటీ చేయగా, ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో లీడ్‌లో ఉంది. ఇక పిఠాపురం నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ క్రమంలో వైసీపీ అభ్యర్థి వంగా గీతపై పవన్ భారీ మెజార్టీతో గెలుపొందారు. సుమారు 70వేలకు పైగా ఓట్లతో ఆయన విజయం సాధించినట్టు తెలుస్తుంది.
దీంతో పిఠాపురం ప్రజల్లో, జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానుల్లో సంతోషం అంబారాన్నింటింది. పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద భారీగా జన సైనికులు చేరి ఆనందాలు వ్యక్తం చేస్తున్నారు. సంబరాలు చేస్తున్నారు. దీంతో అభిమానులను, కార్యకర్తలను కలవడానికి వచ్చారు పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల. ఆమెతోపాటు పవన్ కొడుకు అకీరా నందన్ కూడా రావడం విశేషం. చిన్నమ్మ అన్నా కొణిదెల వెనకాలే అకీరా నందన్ కూడా వచ్చాడు. ప్రజలకు, అభిమానులకు తన అభివాదం తెలిపారు. అచ్చు పవన్ కళ్యాణ్ స్టయిల్‌లో అకీరా నందన్ కూడా అభివాదం తెలియజేయడం విశేషం.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అకీరా నందన్ బయటకు రావడంతో అభిమానులు అరుపులతో హోరెత్తించారు. జనసేన పార్టీ, పవన్ కి జై కొడుతూ గట్టిగా నినాదాలు చేశారు. కాసేపు వారికి కనిపించిన అకీరా నందన్ చిన్నమ్మతో కలిసి లోపలకి వెళ్లిపోయారు. అయితే రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్‌లకు అకీరా నందన్ జన్మించిన విషయం తెలిసిందే. అకీరాకి చెల్లి ఆద్య కూడా ఉన్నారు. రేణు దేశాయ్ పవన్ నుంచి విడిపోయినా, పిల్లలు మాత్రం పవన్‌కి దగ్గరగానే ఉంటున్నారు. తరచూ కలుస్తుంటారు. వారి కాలేజ్ ఈవెంట్లకి పవన్ వెళ్తుంటారు. అలాగే పవన్ ఇంటికి కూడా వాళ్లు వస్తుంటారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పిఠాపురంలోని పవన్ ఇంట్లోనే వీరంతా ఉన్నట్టు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కింగ్ మేకర్‌గా మారారు. కీ ప్లేయర్‌గా నిలిచారు. టీడీపీతో, బీజీపీతో పొత్తు విషయంలోనూ కీలకంగా వ్యవహరించారు. అధికార వైసీపీ ప్రభుత్వాన్ని ఓడగొట్టడంలో ఆయన పాత్ర చాలా కీలకమని చెప్పొచ్చు. అంతేకాదు 2024 ఎన్నికల్లో పవన్ చక్రం తిప్పిన తీరు ఆకట్టుకుంది, అదే ఇప్పుడు విజయానికి రహదారి వేసింది.
