పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం `వకీల్‌సాబ్‌`. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో శృతి హాసన్‌ కథానాయికగా, నివేదా థామస్‌, అంజలి, అనన్య కీలర పాత్రలు పోషిస్తున్నారు. బోనీ కపూర్‌ సమర్పణలో, దిల్‌రాజు నిర్మిస్తున్నారు. `పింక్‌` చిత్రానికిది రీమేక్‌. ఇప్పటికే ఈ చిత్రంలోని రెండు పాటలు విడుదలై శ్రోతలను మెప్పించగా, తాజాగా మరో పాట విడుదలైంది. `కంటి పాప.. కంటి పాప.. `అంటూ సాగే మూడో పాటని బుధవారం సాయంత్రం విడుదల చేశారు.

 పవన్‌, శృతి హాసన్‌ల మధ్య వచ్చే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఆలోచింప చేస్తుంది. పవన్‌, శృతిల ప్రేమ సన్నివేశాల్లో ఈ పాట వస్తుందని అర్థమవుతుంది. తమన్‌ దీనికి సంగీతం అందించగా, ఆర్మన్‌ మాలిక్‌, దీపు, తమన్‌ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి రచించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. గతంలో `మగువ.. మగువ.. `, `సత్యమేవ జయతే` పాటలు విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.