సాయిధరమ్ తేజ్‌కి పవన్ షాక్.. ఆ సినిమా ఆగిపోయినట్టే?
పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు హీరో సాయిధరమ్ తేజ్ తో కలిసి ఓ తమిళ రీమేక్‌లో నటించాల్సి ఉంది. కానీ ఇప్పుడా సినిమా ఆగిపోయినట్టు ప్రచారం జరుగుతుంది.
పవన్ కళ్యాణ్(pawan Kalyan) వరుస రీమేక్ లు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన రీఎంట్రీ ఇస్తూ `పింక్` రీమేక్ `వకీల్ సాబ్` చేసి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మలయాళ హిట్ మూవీ `అయ్యప్పనుమ్ కోషియమ్` ని `భీమ్లా నాయక్`గా రీమేక్ చేసి మరో హిట్‌ని అందుకున్నారు. దీంతోపాటు తమిళంలో ప్రశంసలందుకున్న `వినోదయ సీతం`(Vinodaya Sitham) చిత్రాన్ని కూడా రీమేక్ చేసేందుకు ఒప్పుకున్నారు. తమిళంలో రూపొందించిన నటుడు, దర్శకుడు సముద్రఖనినే ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
ఈ చిత్రంలో కీలక పాత్రలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) కీలక పాత్రలో నటించబోతున్నారు. ఈ సినిమా కోసం ఆయన ఇతర సినిమాని కూడా పక్కన పెట్టి వెయిట్ చేస్తున్నారు. దీనికి త్రివిక్రమ్ మార్పులు చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. అయితే సినిమాని ఆగస్ట్ లోనే ప్రారంభించాలనుకున్నారు. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని భావించారు. ఈ చిత్రం కోసం పవన్ కూడా బల్క్ డేట్స్ కేటాయించినట్టు వార్తలొచ్చాయి.
కానీ ఇప్పటి వరకు సినిమా పట్టాలెక్కలేదు. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియడం లేదు. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. చాలా రోజులుగా ఆయన తన పొలిటికల్ ప్రోగ్రామ్స్ లోనే పాల్గొంటున్నారు. ఎన్నాళ్లుగానో చిత్రీకరణ జరుపుకుంటోన్న `హరిహర వీరమల్లు`ని కూడా పక్కన పెట్టి ఆయన రాజకీయాల్లో బిజీ అవుతుండటంతో ఆయన నెక్ట్స్ సినిమాలపై సస్పెన్స్ నెలకొంది. కొన్ని సందర్భాల్లో ఇక పవన్ సినిమాలు మానేస్తున్నారని, ఇప్పుడు చిత్రీకరణ దశలో ఉన్న సినిమాలు కూడా ఆపేస్తున్నట్టు ప్రచారం జరిగింది.
అయితే `హరి హర వీరమల్లు` షూటింగ్‌కి సిద్ధమయ్యారట పవన్. ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ కావాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుందని ఇటీవల చిత్ర యూనిట్ పేర్కొంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రారంభం కానుందని ఇటీవల పవన్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన `పవర్ గ్లాన్స్`లోనూ ప్రకటించారు. దీంతో సాయిధరమ్‌తో కలిసి చేయాల్సిన `వినోదయ సీతం` చిత్రం ఇక ఆగిపోయినట్టే అనే ప్రచారం ఊపందుకుంది. సాయిధరమ్ తేజ్ కూడా తన ఇతర సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు సమాచారం. ఇన్నాళ్లు వెయిట్ చేసిన సాయి తేజ్ నిరీక్షణ వృథా అయినట్టే అని, మేనల్లుడికి పవన్ షాక్ అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.