పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను పంపిణీ చేసిన సంపత్ కుమార్ 2 కోట్ల రూపాయలు నష్టపోయానంటున్న కృష్ణా జిల్లా పంపిణీ దారు సంపత్ గత కొన్ని రోజులుగా ఫిలిం చాంబర్ ఎదుట నిరాహార దీక్షకు దిగటంతో అరెస్ట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాను కృష్ణా జిల్లాలో డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్ సంపత్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సర్దార్ చిత్రంతో రూ. 2 కోట్లు నష్టపోయిన తనకు తరువాతి సినిమా ‘కాటమరాయుడు’ ను తక్కువ ధరకే ఇస్తామని చెప్పి ఇప్పుడు అసలే ఇవ్వకుండా మోసం చేసారంటూ మీడియా ముందుకొచ్చిన సంత్ కుమార్ పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేయాలి అంటూ పలుసార్లు నిరసన చేపట్టాడు.
అయినా ఎలాంటి స్పందనలేకపోవంతో అతను గత వారం రోజుల నుండి ఫిల్మ్ చాంబర్ ఎదుట నిరాహార దీక్షకు దిగాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ మనుషులుగా చెప్పబడుతున్న కొందరు చాంబర్లో దీక్ష కొనసాగిస్తున్న అతన్ని అక్కడి నుండి బలవంతంగా బయటకు పంపారు. దీంతో ఇక లాభం లేదనుకున్న అతను అక్కడే రోడ్డుపై కూర్చొని తనకు న్యాయం చేయాలంటూ పవన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు కలుగజేసుకుని సంపత్ ను అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఈ విషయంపై పవన్ కాని, ‘కాటమరాయుడు’ నిర్మాత శరత్ మరార్ కానీ స్పందించలేదు.
