పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లడంతో సినిమాలకు దూరమయ్యాడు. ఈ ఏడాది ఎలక్షన్ హడావిడిలో పడి సినిమాల సంగతి పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మళ్లీ సినిమాలపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. గతంలో అతడు తీసుకున్న అడ్వాన్స్ లకి లెక్క చెప్పడం కోసమో, మళ్లీ అభిమానులను అలరించడం కోసమే 
తెలియదు కానీ మరోసారి తన ముఖానికి మేకప్ వేసుకోవాలని నిర్ణయించుకున్నాడట. 

మైత్రి మూవీ మేకర్స్, డీవీవీ దానయ్య, రత్నం వంటి అగ్ర నిర్మాతల అడ్వాన్స్ లు పవన్ దగ్గర ఉన్నాయి. వారితో సినిమాలు చేస్తానని మాట కూడా ఇచ్చాడు. కానీ కుదరలేదు. ఇప్పుడు ఆ అడ్వాన్స్ లు క్లియర్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే 'కథలు రెడీ చేసుకోండి.. నేను సినిమాలు చేయడానికి సిద్ధమే' అంటూ దర్శకనిర్మాతలకు సంకేతాలు పంపాడని తెలుస్తోంది.

దీంతో నిర్మాతలు ఇప్పుడు పవన్ కి తగ్గ కథ కోసం వెతుకులాట  మొదలుపెట్టారు. పవన్ ఒక్కో సినిమా పూర్తి చేయడానికి చాలా సమయం తీసుకుంటాడు. కనీసం ఏడాది ఈజీగా పడుతుంది. కానీ ఈసారి మాత్రం అలా చేయాలనుకోవడం లేదట. వచ్చే రెండేళ్లలో మూడు సినిమాలైనా పూర్తి చేయాలని భావిస్తున్నాడట. 2022 నాటికి మళ్లీ పూర్తిగా రాజకీయ జీవితంపై దృష్టి పెట్టాలని, ఈలోగా తన ఇమేజ్ ని, పొలిటికల్ మైలేజీని పెంచుకునే సినిమాలు చేస్తే బాగుంటుందని భావిస్తున్నాడట. 

పవన్ మళ్లీ సినిమాల్లోకి రావడం అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయమే కానీ అతడికి తగ్గ కథలను వెతకడం నిర్మాతలకు పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. పవన్ చివరిగా నటించిన సినిమా 'అజ్ఞాతవాసి'. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం, ఆ తరువాత పవన్ గ్యాప్ తీసుకోవడంతో అభిమానుల్లో ఒకింత నిరాశ కలిగింది. మరి ఇప్పుడు పవన్ వారిలో జోష్ నింపుతాడేమో చూడాలి!