ఎప్పటిలాగే మరో సంచలనానికి తెర తీసారు రామ్‌ గోపాల్ వర్మ. ఆయన తాజా చిత్రం పవర్‌ స్టార్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లోనే కాక పవన్ అభిమానుల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ ట్విట్టర్‌లో విడుదల చేశారు. తర్వాత సినిమాకి సంబంధించి ఒక్కో హింట్స్ వదిలిన వర్మ.. ఏకంగా సినిమా స్టిల్స్‌ను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ మూవీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూస్తున్న పవన్ అభిమానులు మండిపడుతున్నారు. మరి ఈ విషయం పవన్ అభిప్రాయం ఏమిటి?

మరో ప్రక్క ‘పవర్ స్టార్’ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ మూవీ పవన్ కళ్యాణ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతోందనే టాక్ మొదలైంది. అయితే తాను పవన్ బయోపిక్ రూపొందించడం లేదని ఖరారు చేసిన వర్మ.. టైటిల్ పోస్టర్ ద్వారానే ఈ మూవీ రాజకీయ నేపథ్యంలో ఉంటుందనే చెప్పేశారు. పవర్ స్టార్ టైటిల్ మధ్యలో గాజు గ్లాసు (జనసేన పార్టీ గుర్తు) పెట్టి అనేక ప్రశ్నలకు, అనుమానాలకు తెరలేపారు.

దానికి తోడు ఈ పోస్టర్‌పై ''ఎన్నికల ఫలితాల తర్వాత కథ'' అని రాయడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చలకు తెరలేపింది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోవడం, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలపై వర్మ స్క్రిప్టు రెడీ చేసి, తెరకెక్కిస్తున్నారని సినీ జనం చెప్పుకుంటున్నారు. దీంతో సహజంగానే పవన్ ఈ విషయం పై ఏ విధంగా స్పందిస్తారనేది చర్చనీయాంసంగా మారింది. 

మీడియా వర్గాల్లో చెప్పుకునేదాని ప్రకారం....పవన్ కళ్యాణ్ ఈ సినిమా గురించి తెలిసి నవ్వుకున్నారట. లైట్ తీసుకోమని తమ వాళ్లకు చెప్పారట. మనం ఒక్క మాట మాట్లాడినా అది సినిమాకు పబ్లిసిటీగా మారుతుంది, రాజకీయ జీవితంలోకు వచ్చాక ఇలాంటివి సహజమే అని చెప్పుకొచ్చారట. గతంలోనూ ఎన్టీఆర్ పై రాజకీయ నేపధ్యంలో అనేక సినిమాలు వచ్చాయని, మొన్నటిమొన్న లక్ష్మీస్ ఎన్టీఆర్, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా వచ్చిది...కాబట్టి ఇలాంటివాటిని ఎంత ఇగ్నోర్ చేయగలిగితే అంత మంచిదని పవన్ అన్నట్లు చెప్పుకుంటున్నారు. అదీ నిజమేగా.