తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డిపై కనీవినీ ఎరుగని రీతిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. తాజాగా చిత్ర యూనిట్ సైరా ప్రీరిలీజ్ ఈవెంట్ గురించి ఫ్యాన్స్ పండగ చేసుకునే ప్రకటన విడుదల చేసింది. 

అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సైరా చిత్ర ప్రచార కార్యకమాలు జోరందుకున్నాయి. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ని సెప్టెంబర్ 18న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి సోదరుడు, జనసేనాని పవన్ కళ్యాణ్, దర్శకధీరుడు రాజమౌళి, తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. 

వీరితో పాటు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, వివి వినాయక్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథులుగా హాజరు కానున్నారు. ఎల్బీ స్టేడియంలో ఘనంగా ఈవెంట్ నిర్వహించేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. 

సైరా చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలని హాలీవుడ్ నిపుణుల ఆధ్వర్యంలో చిత్రీకరించారు. నరసింహారెడ్డిగా చిరంజీవి నటించిన పోరాట సన్నివేశాలు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. 

సైరా చిత్రంలో భారీ తారాగణం నటిస్తోంది. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, మిల్కి బ్యూటీ తమన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సౌత్ ఇండియా అన్ని భాషలతో పాటు హిందీలో కూడా పెద్దఎత్తున రిలీజ్ చేస్తున్నారు.