వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన ఉప్పెన చిత్రంపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ నడుస్తుంది. ఉప్పెన సాంగ్స్ తో పాటు ప్రోమోలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో ఉప్పెన కథ అద్భుతం అని, ఇది వంద కోట్ల సినిమా అని పొగడడం సినిమాపై మరింత ఆసక్తి రేపుతోంది.  ఉప్పెన ప్రమోషన్స్ సైతం భారీ ఎత్తున నిర్వహించడం సినిమాకు బాగా కలిసి వస్తుంది. 

ఫిబ్రవరి 12న ఉప్పెన గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఉప్పెన చిత్ర బృందం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కలవడం జరిగింది. అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్ర సెట్స్ లో ఉన్న పవన్ ని కలిసి ఉప్పెన ట్రైలర్ ని ఆయనకు చూపించారు. ఉప్పెన ట్రైలర్ పవన్ కళ్యాణ్ ని ఎంతగానో ఆకట్టుకున్నట్లు తెలిపారు. అలాగే ఉప్పెన చిత్రాన్ని రంగస్థలం, దంగల్ వంటి చిత్రాలతో పవన్ పోల్చడం విశేషం. 

మన చుట్టూ ఉండే వాస్తవిక పరిస్థితులు, జీవితాలు, ఎమోషన్స్ ఆధారంగా తెరకెక్కే చిత్రాలు ఎప్పుడూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటాయి అన్నారు. రంగస్థలం, దంగల్ చిత్రాలు అలాగే తెరకెక్కిన మంచి విజయాలు సాధించాయి అన్నారు పవన్. ఇక మొదటి చిత్రమే ఇలాంటి అద్భుతమైన కథను ఎంచుకోవడం గొప్ప విషయం అని దర్శకుడు బుచ్చిబాబును ప్రశంసించారు. అలాగే మేనల్లుడు వైష్ణవ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా జానీ, శంకర్ దాదా ఎం బి బి ఎస్ చిత్రాలలో నటించి ఈ స్థాయికి వచ్చాడని కొనియాడారు.