నటి పాకీజాకి కోసం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. నటి దీన స్థితిని చూసి కోసం తనవంతుగా అర్థిక సాయం అందజేశారు.
`అసెంబ్లీ రౌడీ` సినిమాతో పాపులర్ అయిన నటి, కమెడియన్ పాకీజా(వాసుకీ) ఒకప్పుడు కామెడీ పాత్రలతో నవ్వులు పూయించింది. బ్రహ్మానందంతో వచ్చే ఆమె సీన్లు బాగా ఆకట్టుకున్నాయి. అప్పట్లో చాలా సినిమాల్లో మెరిసిన ఆమె ఇటీవల కనుమరుగయ్యింది.
అయితే గత కొంత కాలంగా ఆమె ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంది. ఈ క్రమంలో ఇటీవల తనని ఆదుకోవాలని చెప్పి ఆమె రిక్వెస్ట్ చేసింది. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను వేడుకుంటూ ఓ వీడియో విడుదల చేసింది. ఈ క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ స్పందించారు.
నటి పాకీజాకి పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం
నటి పాకీజా ఆవేదనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్నించాడు. ఆమెకి తనవంతుగా ఆర్థిక సాయాన్ని అందించారు. పాకీజా దీన స్థితిని పవన్ దృష్టికి రావడంతో ఆప్త హస్తం అందించారు. ఆమె దీన స్థితి తెలిసి చలించిన పవన్ కళ్యాణ్ రూ. 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
మంగళవారం మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి . హరిప్రసాద్, పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ నటి పాకీజాకు అందజేశారు.
పవన్ అందించిన సాయానికి ఎమోషనల్ అయిన పాకీజా
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ చేసిన సాయానికి పాకీజా కృతజ్ఞతలు తెలిపారు. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తన ఆర్థిక పరిస్థితి గురించి నిన్ననే పవన్ కళ్యాణ్ కార్యాలయానికి తెలియజేశాననీ,
తక్షణం స్పందించి తగిన విధంగా ఆర్థిక సాయం అందించారని తెలిపారు. పవన్ కళ్యాణ్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఆమె వీడియో వైరల్ అవుతుంది.
తనకు సహాయం చేయాలని వేడుకుంటూ నటి పాకీజా వీడియో
అంతకు ముందు నటి పాకీజా ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో తనకు షూటింగ్ లు లేవని, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోవడంతో సొంతూరు కారైకుడికి వచ్చినట్టు చెప్పారు.
ఏదైనా సాయం చేస్తారని సీఎంని కలవడానికి రెండు సార్లు ప్రయత్నించానని, కానీ కలవడం కుదరలేదని, ఆ తర్వాత డిప్యూటీ సీఎంని కలవాలని ప్రయత్నించినా, కుదరలేదని తెలిపారు.
పెన్షన్ ఇప్పించాలంటూ నటి పాకీజా వేడుకోలు
తనకు తమిళనాడులో ఆధార్ కార్డ్ ఉందని, దీని ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌లో నెల నెల పెన్షన్ వచ్చేలా చేయండి, మీ కాళ్లు పట్టుకుని వేడుకుంటాను. భర్త, పిల్లలు ఎవరూ లేరు, అనాథగా ఉంటున్నా, గతంలో చిరంజీవి, నాగబాబు సాయం చేశారు.
ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు పవన్ దయజేసి నన్ను ఆదుకోండి, నాకు కనీసం పెన్షన్ అందేలా చేయండి అని ఆమె వేడుకుంటూ ఓ వీడియో విడుదల చేసింది. ఇది పవన్ కళ్యాణ్‌కి చేరడంతో ఆయన రెండు లక్షల సాయం అందజేశారు.
