పవన్‌ కళ్యాణ్‌ సినిమాల స్పీడ్‌ మామూలుగా లేదు. ఆయన కెరీర్‌లో ఎప్పుడూ ఇంత వేగంగా సినిమాలు ఓకే చేయలేదు. మూడేళ్ళ క్రితం రాజకీయాల్లో బిజీ అయిన పవన్‌ సినిమాలను వదిలేశారు. ఎలక్షన్‌లో ఘోర పరాజయం తర్వాత తిరిగి సినిమాలు చేయాలని డిసైడ్‌ అయ్యాడు. తన మెయింటనెన్స్ కి, ఫ్యామిలీని నడిపేందుకు డబ్బులు కావాలని, అందుకే సినిమాలు చేస్తున్నానని రీఎంట్రీకి సంబంధించి వచ్చిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

రావడం రావడంతోనే ఏకంగా మూడు సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అందులో ప్రస్తుతం వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో `వకీల్‌సాబ్‌`లో నటిస్తున్నాడు. ఇది దాదాపు చిత్రీకరణ సగానిపైగానే పూర్తి చేసుకుంది. అన్నికుదిరితే ఈ సమ్మర్‌లోనే విడుదల కావాల్సింది. కానీ వైరస్‌ కారణంగా వచ్చిన లాక్‌డౌన్‌తో వాయిదా పడింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇప్పట్లో షూటింగ్‌ స్టార్ట్ అయ్యేలా లేదు. మరో నెలకుపైగానే పడుతుంది. ఇందులో అంజలి, నివేదా థామస్‌ కీలక పాత్రలు పోషిస్తుండగా, శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటించనున్నట్టు తెలుస్తుంది.

దీంతోపాటు క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి `గజదొంగ` అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. ఇది చిత్రీకరణ కూడా ప్రారంభించుకుంది. మరోవైపు హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లోనూ ఓ సినిమా చేయబోతున్నారు పవన్‌. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. తాజాగా మరో సినిమాకి ఈ గబ్బర్‌ సింగ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. `సైరా నరసింహారెడ్డి`తో దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్న సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. 

తాజాగా ఈ విషయాన్ని పవన్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. పవన్‌ నెక్ట్స్ సినిమా ఎస్‌ఆర్‌టీ బ్యానర్‌లో, సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఉంటుందని ఫ్యాన్స్ క్లబ్‌ సర్కిల్‌లో తెగ హంగామా చేస్తుంది. అంతేకాదు ఈ సినిమా ప్రకటన సెప్టెంబర్‌ 1న  రానుందని అంటున్నారు. ఇక స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15న పవన్‌ బర్త్ డే సీడీపీని విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. పవన్‌ బర్త్ డే సెప్టెంబర్‌ 2 అనే విషయం తెలిసిందే. మహేష్‌బాబుని మించేలా సోషల్‌ మీడియాలో పవన్‌ బర్త్ డే యాష్‌ ట్యాగ్‌ని ట్రెండింగ్‌ చేయించాలని భావిస్తున్నారు. మరి అది ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి.