ఇద్దరు సూపర్‌ స్టార్లు ఒకే తెరపై కనిపిస్తే, ఫ్యాన్స్ కి పూనకమే. వారిని చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. ఆ సినిమాపై అంచనాలకు ఆకాశమే హద్దుగా ఉంటుంది. మరి టాలీవుడ్‌ పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు కలిసి ఒకే తెరపై కనిపిస్తే, నిజంగానే ఇరు స్టార్స్ అభిమానులు పూనకంతో ఊగిపోతారని చెప్పడంలో అతిశయోక్తిలేదు. 

తాజాగా అలాంటి అరుదైన సన్నివేశం చోటు చేసుకోబోతుందట. దానికి మహేష్‌ నటిస్తున్న `సర్కారు వారి పాట` వేదిక కాబోతుందని తెలుస్తుంది. మహేష్‌ హీరోగా, పరశురామ్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా జనవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ని జరుపుకోబోతుంది. ఇదిలా ఉంటే ఇందులో ఓ ముఖ్య మైన పాత్రకు స్కోప్‌ ఉందట. 

కేవలం ఐదు నిమిషాల నిడివి గల ఈ స్పెషల్‌ క్యారెక్టర్‌లో పవన్‌ కళ్యాణ్‌ని నటింప చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు పరశురామ్‌ పవన్‌ని సంప్రదించారని, అందుకు ఆయన ఓకే చెప్పారని టాక్‌. మరి ఇందులో నిజమెంతోగానీ, ఈ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. అటు పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్, ఇటు మహేష్‌ ఫ్యాన్స్ తెగ వైరల్‌ చేస్తున్నారు. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే. ఇదిలా ఉంటే పవన్‌ నటించిన `జల్సా` చిత్రానికి మహేష్‌ నరేటర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. 

ఇక ప్రస్తుతం పవన్‌ `వకీల్‌సాబ్‌` చిత్రంతోపాటు క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా, హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో మరోసినిమా, సాగర్‌ కె చంద్ర దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. అలాగే సురేందర్‌రెడ్డితోనూ ఓ సినిమాకి కమిట్‌మెంట్‌ ఉందని సమాచారం.