పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకు ఈ సెప్టెంబర్‌ 2 ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం. ఓ గొప్ప అనుభూతి. ఒకేరోజు పవన్‌కి సంబంధించిన నాలుగు సినిమాల అప్‌డేట్‌లు వస్తున్నాయి. అదే సమయంలో పెద్ద విషాదం కూడా. ఎందుకంటే పవర్‌ స్టార్‌ బర్త్ డే వేడుకలకు సంబంధించి జరిగిన ఘటనలో ముగ్గురు అభిమానులు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలా సంతోషకరంగానూ, బాధాకరంగానూ ఈ బర్త్ డే ఎప్పటికీ మర్చిపోలేని బర్త్ డేగా నిలిచింది. 

సంతోకరమైన విషయాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పవన్‌ నటిస్తున్న మూడు సినిమాల అప్‌డేట్‌లు వచ్చాయి. `వకీల్‌ సాబ్‌` మోషన్‌ పోస్టర్‌ విడుదలైంది. లుక్‌ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. దీనికి వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తుండగా, నివేదా థామస్‌, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాని దిల్‌రాజు, బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. 

దీంతోపాటు క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్‌ సినిమా ప్రీలుక్‌ని విడుదల చేశారు. దీన్ని ఏ.ఎం రత్నం నిర్మిస్తున్నారు. ఇది పవన్‌ నటిస్తున్న 27వ సినిమా కావడం విశేషం. దీంతోపాటు హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో నటించబోతున్న 28వ అప్‌డేట్‌ని ఈ సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయనున్నారు. 

దీంతోపాటు నాలుగో సినిమా ప్రకటన కూడా వచ్చింది. పవన్‌ నటించబోతున్న 29వ సినిమా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఉంటుందని గతంలో వార్తలు వినిపించాయి. తాజాగా ఆ విషయం స్పష్టమైంది. దీన్ని ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. సురేందర్‌రెడ్డి, రామ్‌ తాళ్లూరి కలిసి పీఎస్‌పీకే 29గా పవన్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం విశేషం. దీంతో పరోక్షంగా నెక్ట్స్ పవన్‌ నటించబోయేది సురేందర్‌రెడ్డి దర్శకత్వంలోనే అనే విషయం క్లారిటీ వచ్చేసింది. దీంతో అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఎన్నడూ లేని విధంగా పవన్‌ ఈ రేంజ్‌లో బ్యాక్‌ టూ బ్యాక్‌ సర్‌ప్రైజ్‌లివ్వడంతో టాలీవుడ్‌లో మెగా సందడి నెలకొంది.