Asianet News TeluguAsianet News Telugu

ఫ్యాన్స్ ను నిరుత్సాహపరిచిన పవర్ స్టార్ అజ్ఞాతవాసి-రివ్యూ రేటింగ్

  • చిత్రం : అజ్ఞాతవాసి
  • నటీనటులు : ప‌వ‌న్ క‌ల్యాణ్‌, కీర్తిసురేష్‌, అను ఇమాన్యుయేల్‌, ఖుష్బూ, బొమన్ ఇరానీ, మురళిశర్మ, రావు రమేష్, తనికెళ్ల భరణి తదితరులు 
  • సంగీతం : అనిరుధ్‌
  • నిర్మాత : ఎస్‌.రాధాకృష్ణ‌
  • ద‌ర్శ‌క‌త్వం : త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌
  • నిర్మాణ సంస్థ: హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌
  • ఆసియానెట్ రేటింగ్ - 2.75/5
pawan kalyan fans got disappointed with agnyathavaasi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ప్రారంభమైన రోజు నుంచీ భారీ హైప్ క్రియేట్ కావటం.. అది కూడా సంక్రాంతి సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకుండే క్రేజ్ నేపథ్యంలో ఈ పండగ కానుకగా రిలీజైన అజ్ఞాతవాసి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప‌వ‌న్ సినిమా అంటేనే ఓ క్రేజ్ ఉండటం సహజం. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఆ క్రేజే వేరు. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో వ‌చ్చిన 'జ‌ల్సా', 'అత్తారింటికి దారేది' చిత్రాలు భారీ విజ‌యాలు అందుకున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం అజ్ఞాతవాసి బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మ‌రి 'అజ్ఞాత‌వాసి' ఈ కాంబినేషన్ కు హ్యాట్రిక్ హిట్ అందించిందా... రివ్యూ చూద్దాం.

కథ:

ఏబీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమాని గోవింద భార్గవ్ అలలియాస్ విందా(బొమన్ ఇరానీ) సొంతంగా స్వశక్తితో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యన్ని నిర్మించిన ప్రముఖ వ్యాపార వేత్త‌. అయితే తన ఆప్త మిత్రుడే తనను మోసం చేసినట్లు తెలుసుకున్న విందా.. ప్రతి విషయంలోనూ ప్లాన్ ఏ తోపాటు సేఫ్ సైడ్ గా ప్లాన్ బీని రెడీగా వుంచుకుంటాడు. తను అనుమానించినట్లుగానే విందాను కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు చంపేస్తారు. అనంతరం ప్రపంచానికి తెలిసిన అత‌ని త‌న‌యుడినీ చంపేస్తారు. భర్తనూ, కొడుకునూ కోల్పోయిన విందా భార్య ఇంద్రాణి (ఖుష్బూ) తమ వ్యాపార వ్య‌వ‌హారాలను చూసుకునేందుకు నమ్మకస్తుడైన బాల‌సుబ్ర‌మ‌ణ్యం(ప‌వ‌న్ క‌ల్యాణ్‌)ని ఏబీ కంపెనీ మేనేజ‌ర్‌గా నియ‌మిస్తుంది.

 

అస్సాం నుండి వ‌చ్చిన బాల‌సుబ్ర‌మ‌ణ్యం కంపెనీ మేనేజ‌ర్‌గా వ్య‌వ‌హారాలు చూసుకుంటూ.. విందా హ‌త్య‌కు కార‌కులెవ‌ర‌నే దానిపై ఆరా తీస్తుంటాడు. ఇంత‌కు విందాను హ‌త్య చేసిందెవ‌రు? అస‌లు బాల‌సుబ్ర‌మ‌ణ్యం ఎవ‌రు? ఏబీ కంపెనీ మేనేజ‌ర్‌గా ఇతన్నే నియమించటానికి కార‌ణాలేంటి? బాల‌సుబ్ర‌మ‌ణ్యంకు ఏబీ కంపెనీల వారసుడు అభిశిక్త్ భార్గ‌వ‌కు ఉన్న రిలేష‌న్ ఏంటి? ఏబీ కంపెనీని తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకునే సీతారామ్‌(ఆదిపినిశెట్టి) ఎవ‌రు? త‌న‌కి, విందాకు ఉన్న లింకేంటి? అనే విష‌యాలు వెండితెరపై చూడాల్సిందే. 

 

విశ్లేషణ :

పవన్ కల్యాణ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కథను దర్శకుడు త్రివిక్రమ్ సినిమా పినిషింగ్ విషయంలో తొందరపడ్డాడనిపిస్తుంది. సంక్రాంతికి ఎలాగైనా రిలీజ్ చేయాలనే తొందరలో కొన్ని చిన్న చిన్న విషయాలు సింక్ చేయటంలో, అభిమానులు కాని ప్రేక్షకులను కన్విన్స్ చేయటంలో విఫలమయ్యాడనిపిస్తుంది. పక్కా స్క్రిప్ట్ తో రంగంలోకి దిగే త్రివిక్రమ్ ఈసారి అజ్ఞాతవాసి ఎడిటింగ్ అండ్ ఫినిషింగ్ విషయంలో సమయం కేటాయించలేదా అనే అనుమానం కలుగుతుంది. డైలాగ్స్ తో కవర్ చేసే ప్రయత్నం చేశాడనిపిస్తుంది.

 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం బాల‌సుబ్ర‌మ‌ణ్యం, అభిష‌క్త్ భార్గ‌వ అనే రెండు డిఫరెంట్ షేడ్స్‌ లో వున్న ప‌వ‌న్ తన కేరక్టర్ కు తగిన న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. త‌న‌దైన మార్కు డైలాగ్స్‌, యాక్ష‌న్స్ సీక్వెన్స్‌, న‌ట‌న‌తో ఆకట్టుకున్న ప‌వ‌న్ అజ్ఞాతవాసి అభిమానులను మెప్పించ‌డం ఖాయం. ఇక సినిమాలో చెప్పుకోవాల్సిన మ‌రో పాత్ర ఖుష్బూ.. ఇంద్రాణి పాత్ర‌లో చ‌క్క‌గా ఒదిగిపోయింది. స్టాలిన్ త‌ర్వాత మ‌రోసారి తెలుగులో మంచి పాత్ర‌లో క‌న‌ప‌డింది ఖుష్బూ. క్లైమాక్స్‌ లో ఖుష్బూ న‌ట‌న మెప్పిస్తుంది. ఇక సినిమాలో సుకుమారి(కీర్తిసురేష్‌), సూర్యకాంతం(అను ఇమాన్యుయేల్) పాత్ర‌లు గ్లామ‌ర్‌కే ప‌రిమిత‌మయ్యాయి. ముఖ్యంగా అను ఎమాన్యుయెల్ అందాల ఆరబోత కుర్రకారుకు కనువిందే. ఇక ఆది పినిశెట్టి ఈ చిత్రంలోనూ తన మార్క్ విలనిజాన్ని చూపాడు. ముర‌ళీశ‌ర్మ‌, రావు ర‌మేష్ పాత్ర‌లు కామెడీకి ప‌రిమితమయ్యాయి. మిగిలిన పాత్ర‌ధారులంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. 

 

ఇక ఈ సినిమా ద్వారా తెలుగులోకి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇచ్చిన అనిరుధ్ త‌న‌దైన స్టైల్లో మంచి సంగీతాన్ని అందించాడు. మూడు పాట‌లు బావున్నాయి. ముఖ్యంగా ప‌వ‌న్ పాడిన "కొడ‌కా కోటేశ్వ‌ర‌రావా" పాట ఆక‌ట్టుకుంటుంది. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కాస్త సిచువేషన్ కు మరింత యాడ్ అవుతే బాగుండేదనిపించింది. ముఖ్యంగా సెంటిమెంట్ సీన్స్ లో నేపథ్య సంగీతం మరింత యాప్ట్ గా వుంటే బాగుండనిపించింది. ఇక సినిమాటోగ్రఫర్ మ‌ణికంఠన్ మాత్రం ప్ర‌తి స‌న్నివేశాన్ని చ‌క్క‌గా చిత్రీక‌రించారు. నిర్మాణ విలువలు పర్ ఫెక్ట్ గా కనిపించాయి. ప్రతీ సీన్లో ప్రతి ఫ్రేమ్ లో రిచ్ నెస్ కనిపిస్తుంది.

 

చివరగా...

పవన్ అభిమానులకు నచ్చే “అజ్ఞాతవాసి”, తెలంగాణ సర్కారు అదనపు షోలకు అనుమతివ్వక పోవటంతో నిరుత్సాహానికి లోనైన పవన్ అభిమానులు

Follow Us:
Download App:
  • android
  • ios