మరికొద్ది గంటల్లో వకీల్ సాబ్ టీజర్ విడుదల కానుంది. దాదాపు వారం రోజులుగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, టీజర్ పెద్ద ఎత్తున ట్రెండ్ చేయాలని, అనేక రికార్డ్స్ నెలకొల్పాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. దాదాపు మూడు సంవత్సరాల తరువాత పవన్ నుండి వస్తున్న వకీల్ సాబ్ టీజర్ కోసం వేయికళ్లతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రతి విషయంలో తమ హీరో ముందు ఉండాలని భావించే ఆయన ఫ్యాన్స్ ఇప్పటికే అనేక రికార్డ్స్ ఆయన పేరున నమోదు చేశారు. 

అలాగే వకీల్ సాబ్ టీజర్ కూడా భారీగా ట్రెండ్ చేసి వ్యూస్, లైక్స్ విషయంలో కొత్త రికార్డ్స్ నెలకొల్పాలి అనేది వారి సంకల్పం. అయితే ఈ మధ్యనే విడుదలైన కెజిఎఫ్ 2 టీజర్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మొదటి 24గంటల్లో 78మిలియన్ వ్యూస్ దక్కించుకున్న ఈ టీజర్ కేవలం నాలుగురోజుల్లో 140మిలియన్స్ కి పైగా వ్యూస్ రాబట్టింది. దేశంలోనే మరే చిత్ర టీజర్ ఈ స్థాయి వ్యూస్ రాబట్టలేదు. 

తాము తలచుకుంటే ఏదైనా సాధ్యమే అని భావించే పవన్ ఫ్యాన్స్ మాత్రం కెజిఎఫ్ 2 టీజర్ రికార్డు బద్దలు కొడతాం అంటున్నారు. అంతకు మించిన వ్యూస్ రాబట్టి వరల్డ్ రికార్డు నెలకొల్పతామని సోషల్ మీడియా వేదికగా చర్చ మొదలుపెట్టారు. ఎవరికీ అందనంత ఎత్తులో కెజిఎఫ్ 2 టీజర్ రికార్డు ఉండగా, మరి దాన్ని బీట్ చేస్తామని ఏ ధైర్యంతో పవన్ ఫ్యాన్స్ అంటున్నారో చూడాలి. 

దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన వకీల్ సాబ్ మూవీలో శృతి హాసన్ పవన్ కళ్యాణ్ కి జంటగా నటించారు. దిల్ రాజు, బోనీ కపూర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. థమన్ సంగీతం అందించగా నివేదా థామస్, అంజలి కీలక రోల్స్ చేయడం జరిగింది.