ఇండస్ట్రీలో మరే ఇతర స్టార్ హీరోకి లేని ఫాలోయింగ్ పవన్ సొంతం. వరుసగా 10 సినిమాలు ఫ్లాప్ ఐనా.. క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కల్యాణ్ డైలాగ్ డెలివరీకి.. థియేటర్లో అరుపులు ఓ రేంజ్‌లో ఉంటాయంతే. 


పవన్ కళ్యాణ్ పేరు కు ముందు పవర్ స్టార్ అనేది ఖచ్చితంగా కనపడి తీరుతుంది. ఈ విషయం మనకు గత కొన్నేళ్లుగా తెలుసు. ఆయనకు ఉన్న క్రేజ్ కు, ఇమేజ్ కు పవర్ స్టార్ అనేది ఫెరఫెక్ట్. మరే హీరోకు అందనంత ఎత్తుకు ఎదిగి కోట్లాదిమంది గుండెల్లో గూడుకట్టుకున్న పవన్ కు పవర్ స్టార్ అనేది పర్యాయపదంలా మారింది. అయితే పవన్ కళ్యాణ్‌ ఇప్పుడు పవర్ స్టార్ అని పిలిపించుకోవటం వద్దనుకుంటున్నారా..అంటే అవుననే అనిపిస్తోంది. 

పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా రిలీజ్ చేసిన పోస్టర్స్ లో ఎక్కడా కూడా పవర్ స్టార్ అనేది లేదు. పవన్ కళ్యాణ్ ని తరుచుగా PSPK అంటూంటారు. అంటే ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ అని అర్దం. అయితే ఏ పోస్టర్ మీదా PSPK గానీ పవర్ స్టార్ అని ఈ సారి కనపడకపోవటం యాధృచ్చికమైతే కాదంటున్నారు.కావాలనే పవన్ కళ్యాణ్ తన పేరు ముందు ఆ ట్యాగ్ ని వద్దనుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అలాగే తమన్ వంటి వారి ట్వీట్ లలోనూ లీడర్, అని కనపడుతుంది. అలాగే మరికొంతమంది జనసేనాని అని రాసారు. రాజకీయాలకు,సినిమాలకు సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడంటున్నారు.

ఇక పవన్ కెరీర్ ప్రారంభంలో సూపర్ హిట్ గా నిలిచిన 'గోకులంలో సీత' సినిమాకు మాటలు రాసిన రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి తొలిసారి పవన్ కళ్యాణ్‌ని పవర్ స్టార్ అని సంబోధించారు. ఈ చిత్ర విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోసాని అలా అన్నారు. దీంతో పలు మీడియా కథనాల్లో పవన్ కళ్యాణ్ పేరుకు ముందు పవర్ స్టార్ బిరుదుతో కథనాలు రావడం, ఆ తర్వాత సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌‌పై వచ్చిన ‘సుస్వాగతం’ సినిమాకు తొలిసారిగా పవన్ కళ్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ బిరుదుతో టైటిల్ కార్డ్ వేయడం జరిగింది.

ఇక సెప్టెంబరు 2న పవన్ కల్యాణ్‌ 50వ జన్మదినం కావడంతో తన సినిమాలకి సంబందించిన తాజా అప్‌డేట్లు రావటంతో ఆయన ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు క్రిష్‌ డైరెక్షన్‌లో ‘హరి హర వీరమల్లు’తో పాటు హరీష్ శంకర్ సినిమాలతో తన కెరీర్‌లో ఎప్పుడూ లేనంత బిజీగా ఉన్నారు.