అభిమానం అనే పదాన్ని భక్తిస్థాయికి తీసుకువెళ్లిన ట్రెండ్ సెట్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రజల కోసం నిలబడ్డ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టింది ఈరోజే. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు, స్టార్లు ఉండొచ్చు.. కానీ పవర్ స్టార్ కి ఉండే క్రేజే వేరు. అభిమానుల్లో ఆయనకు ఉన్న స్థాయి వేరు.. స్థానం వేరు. పవన్ అభిమానులు తాము పవన్ కి భక్తులమని చెప్పుకుంటుంటారు. అంతలా పవన్ ని తమ అభిమానంతో పూజిస్తుంటారు. మెగాస్టార్ తమ్ముడిగా 1996లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు.

ఆ తరువాత 'గోకులంలో సీత','సుస్వాగతం' వంటి సినిమాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. 'తొలిప్రేమ' చిత్రంలో నటించి ఓ అద్భుత ప్రేమ కావ్యాన్ని తెలుగు వారికి అందించారు. ఆ తరువాత తమ్ముడు, బద్రి ఇలా వరుస హిట్స్ తో ఆయన స్టామినా అమాంతం పెరిగిపోయింది. 2001లో వచ్చిన 'ఖుషి' ఆయన కెరీర్ లో బెస్ట్ ఫిలింగా నిలిచిపోయింది. భారీ వసూళ్లు సాధించి ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేసింది. నటుడిగానే కాకుండా 'జానీ' సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కినప్పటికీ కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు.

ఆ తరువాత కెరీర్ పరంగా ఎన్నో ఫ్లాపులు చూసినప్పటికీ 'జల్సా'తో మరోసారి తన స్టామినా నిరూపించాడు. మళ్లీ 'పులి','తీన్ మార్','పంజా' సినిమాలతో ఫ్లాపులు వెంటాడినప్పటికీ.. ''కొన్నిసార్లు రావడం లేటవ్వొచ్చేమో.. కానీ రావడం మాత్రం పక్కా'' అంటూ 'గబ్బర్ సింగ్' తో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాడు. పవర్ స్టార్ స్టామినా ఇదీ అని నిరూపించిన ఈ సినిమాతో పవన్ మార్కెట్ మరింత పెరిగింది. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో అతడు ఏర్పాటు చేసిన 'జనసేన' పార్టీ ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రావడంతో నటుడిగా పవన్ కి గ్యాప్ వచ్చేసింది.

సినిమాల్లో బిజీగా ఉండే పవన్ ప్రజల కోసం ఆలోచించి వారికి సాయం చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చారు.ప్రజలకు ఎలాంటి అన్యాయం జరిగినా.. సహించడు. వారి తరఫున పోరాడాడు.. పోరాడుతున్నాడు.. పోరాడతాడు. పొలిటికల్ గా కూడా తన పవర్ ఏంటో చూపిస్తున్నాడు. వచ్చే ఏడాది ఎలెక్షన్స్ లో పూర్తి స్థాయిలో జనసేన పార్టీని రంగంలోకి దించి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆయన తలపెట్టిన కార్యానికి మంచి జరగాలని కోరుకుంటూ మరోసారి పవన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం!