విజయ్ హీరోగా వచ్చిన మెర్సల్ తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్ కు ప్లాన్ కానీ సడెన్ గా విడుదల వాయిదా, కారణం పవన్ కళ్యాణ్?
తమిళ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'మెర్సల్'. దీపావళి కానుకగా విడుదలై కోలీవుడ్ లో భారీ విజయం సాధించింది. కలెక్షన్లతో పాటు అనేక వివాదాలకు కారణమైన... ఈ సినిమా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని, జీఎస్టీని టార్గెట్ చేస్తూ రాజకీయ విమర్శలు చేస్తున్న డైలాగులతో ఉందంటూ ఆందోళనలు వెల్లువెత్తడం, కొందరు కేసులు వేయడం తెలిసిందే. తమిళ వెర్షన్ దాదాపు రూ. 200 కోట్లు వసూలు చేసింది.
మెర్సల్ తెలుగులోనూ దీపావళి కానుకగా 'అదిరింది' పేరుతో విడుదలవ్వాల్సి ఉండగా... పలు కారణాలతో చివరి నిమిషంలో రిలీజ్ ఆగిపోయింది. తెలుగు వెర్షన్ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఆన్‌లైన్ టిక్కెట్లు కూడా ఇష్యూ చేశారు. అయితే చివరి నిమిషంలో సినిమా విడుదల ఆగిపోవడంతో టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేశారు. మళ్లీ ఎప్పుడు విడుదలవుతుందో.. అసలు విడుదలవుతుందో లేదో... అనే క్లారిటీ కూడా లేదు. ఈ సినిమా తెలుగు రిలీజ్ రైట్స్ దక్కించుకున్న నిర్మాత శరత్ మరార్ కూడా నోరు విప్పడం లేదు, ఆయన మీడియాకు కూడా దొరకడం లేదు. దీంతో మెర్సల్ తెలుగు విషయంలో కొత్త వార్తలు తెరపైకి వచ్చాయి.
మెర్సల్ సినిమాకు సంబంధించి ఊహించని విధంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పేరు తెరపైకి వచ్చింది. మెర్సల్ తెలుగు రీమేక్ రైట్స్ గీతా ఆర్ట్స్ అధినేత కొనుగోలు చేశారంటూ ప్రచారం మొదలైంది. ఈ సినిమాను తెలుగులో స్టార్ హీరోతో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.
థియేటర్ వరకు వచ్చిన ఓ డబ్బింగ్ సినిమా రిలీజ్ ఆపి... దాని రీమేక్ రైట్స్ మరో నిర్మాత దక్కించుకోవడం లాంటివి అసలు జరుగుతాయా? ఏమో... ప్రస్తుతం ప్రచారంలోకి వచ్చిన వార్తలు వింటుంటే ఏది నమ్మాలో... నమ్మకూడదో అర్థం కావడం లేదు. దీనిపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ సినిమాను గానీ పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేయరు కదా? అంటూ కొందరు సందేహ పడుతున్నారు. మెర్సల్ తెలుగు వెర్షన్ ఆయనతో రీమేక్ చేస్తే... పొలిటికల్ పరంగా ఈ సినిమా ప్లస్సయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
