పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భీమ్లా నాయక్ ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ అదిరిపోయింది అనే చెప్పాలి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. మలయాళంలో ఘన విజయం సాధించిన అయ్యప్పన్ కోషియం చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. సాగర్ చంద్ర దర్శకుడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మరికొద్దిరోజులోనే బాక్సాఫీస్ వద్ద భీమ్లా నాయక్ సందడి షురూ కానుంది.
కాగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భీమ్లా నాయక్ ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ అదిరిపోయింది అనే చెప్పాలి. 2 నిమిషాల 37 సెకండ్ల నిడివి ఉన్న ట్రైలర్ పవన్ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇస్తూ ప్రస్తుతం ఉన్న హైప్ రెట్టింపయ్యేలా చేసింది.
'ఏంటి బాలాజీ స్పీడ్ పెంచావ్' అంటూ రానా వాయిస్ తో ట్రైలర్ మొదలవుతుంది. డానీ.. డానియల్ శేఖర్ అంటూ రానా ఎంట్రీ ఇస్తాడు. పవన్ కళ్యాణ్ బైక్ లో పవర్ ఫుల్ గా ఎంట్రీ ఇస్తాడు. భీమ్లా నాయక్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అంటూ తనని తాను పరిచయం చేసుకుంటాడు. ట్రైలర్ లో పవన్, రానా మధ్య ఫేస్ ఆఫ్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి.
పవన్ , రానా ఎదురైనప్పుడు ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ కలిగించేలా ట్రైలర్ రూపొందించారు. రానా .. పవన్ కళ్యాణ్ వద్ద పొగరు చూపించడం.. పవన్ కూడా తన యాటిట్యూడ్, కోపంతో సమాధానం ఇవ్వడం గమ్మత్తుగా ఉంది. 'ఏం నాయక్.. నువ్వు పేల్చినప్పుడు వాడు లోపల లేడా.. చూసుకోవాలి కదా' అంటూ నిత్యామీనన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. నేను ఇవతల ఉంటేనే చట్టం.. అవతలికి వస్తే కష్టం.. వాడికి' అంటూ పవన్ చెప్పే డైలాగ్ త్రివిక్రమ్ స్టైల్ గుర్తు చేసే విధంగా ఉంది.
మొత్తంగా భీమ్లా నాయక్ ట్రైలర్ పవన్, రానా మధ్య యుద్ధం బలంగా ఉండబోతోంది అనే సంకేతాలు ఇస్తోంది. అలాగే బాక్సాఫీస్ వద్ద జాతర కూడా ఒక రేంజ్ లో ఉండబోతోంది. పవన్ సరసన నిత్యా మీనన్.. రానాకి జోడిగా సంయుక్త మీనన్ నటించారు. సో పవన్ ఫ్యాన్స్ అంతా ఫిబ్రవరి 25న థియేటర్స్ లో భీమ్లా నాయక్ మాస్ మానియాకి రెడీ అయిపోవడమే.

